మహేష్ బాబుకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తున్న జగన్

Wed Feb 26 2020 12:45:02 GMT+0530 (IST)

Jagan Gives Fee Reimbursement To mahesh babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. స్టార్ డం ఆదాయంలో నిజంగానే శ్రీమంతుడు. అంతటి కుబేరుడికి ఏపీ సీఎం జగన్ పథకం అందడమేంటి? మహేష్ బాబును లబ్ధిదారుగా చూపించడమేంటి? మహేష్ బాబుకు అంత ఖర్మ పట్టిందా? అనే అనుమానాలు కలుగుకమానదు. కానీ మహేష్ బాబుకు అలాంటి పరిస్థితి రాలేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మహేష్ బాబు ఇప్పుడు ‘జగనన్న విద్యాదీవెన’ పథకానికి లబ్ధిదారుగా మారిపోయాడు.కర్నూలు జిల్లాలో ఈ చోద్యం వెలుగుచూసింది. మహేష్ బాబు ఫొటోతో జగనన్న విద్యాదీవెన కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో వైష్ణవి డిగ్రీకాలేజీలో ఈడిగ లోకేష్ గౌడ్ బీకాం ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఇతడు జగనన్న విద్యాదీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

తాజాగా లోకేష్ గౌడ్ కు జగనన్న విద్యాదీవెన ఇస్తూ కార్డు అందింది. అది చూసి విద్యార్థి అవాక్కయ్యాడు. ఎందుకంటే లోకేష్ గౌడ్ ఫొటోకు బదులుగా మహేష్ బాబు ఫొటో కనిపించింది. దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.

సచివాలయ ఉద్యోగులు చేసిన తప్పుతో ఇప్పుడు మహేష్ బాబు జగన్ లబ్ధిదారుగా మారిపోయాడు. ఫీజు రీయింబర్స్ మెంట్ తీసుకునే వ్యక్తిగా మారాడు. ఈ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.