అతిపెద్ద ప్రాజెక్టులో జగన్ కు అరుదైన గౌరవం

Wed Jun 19 2019 21:20:12 GMT+0530 (IST)

సుహృద్భావంతో ఏదయినా సాధ్యమే అని చెప్పడానికి కాళేశ్వరం ప్రాజెక్టే ఒక ఉదాహరణ. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తెలుగు రాష్ట్రాల మధ్య చీటికిమాటికీ వివాదాలు ఉండేవి. ఏపీ ముఖ్యమంత్రి అంటే పడేది కాదు. కానీ... జగన్ - కేసీఆర్ స్నేహపూర్వక విధానం మంచి ఫలితాలే ఇస్తున్నాయి.ఎగువ రాష్ట్రమయిన మహారాష్ట్రతో - దిగువ రాష్ట్రమైన ఏపీతో సఖ్యతగా ఉండి కేసీఆర్ తెలంగాణను జలసిరితో నింపడానికి తపిస్తున్నారు. చక్కటి ప్రణాళికతో తెలుగు రాష్ట్రాల్లో ప్రతి అంగుళానికీ నీరిద్దాం అంటూ చర్చించుకున్నారు. తెలంగాణకు సంపూర్ణ సహకారం అందిస్తున్న ఇద్దరు ముఖ్యమంత్రులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక గౌరవం కల్పించింది.

తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు శిలాఫలకంపై వైఎస్ జగన్ పేరును లిఖించారు. అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ పేరును కూడా ముద్రించారు. వీరిద్దరిని ముఖ్యఅతిథులుగా పేర్కొంటూ తయారు చేసిన శిలాఫలకం సిద్ధమయ్యింది. మొదట గవర్నర్ నరసింహన్ పేరు - తర్వాత ముఖ్యమంత్రి పేరు అనంతరం ముఖ్యఅతిథులుగా ఇద్దరు ముఖ్యమంత్రుల పేర్లు లిఖించారు.

కాళేశ్వరం వివరాలు

- గోదావరి బేసిన్ లోనే అత్యధిక జలాల నిల్వకు వేదిక
- ఒక్క కాళేశ్వరం పరిధిలోనే 141 టీఎంసీల రిజర్వాయర్లు
- 100 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తుకు జలాల తరలింపు
- ఆసియాలోనే అతి పెద్ద 139 మెగావాట్ల మోటరు వినియోగం..
- రికార్డులకు కేంద్ర బిందువుగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం