Begin typing your search above and press return to search.

ఆహా : కాట‌న్ దొర‌ను మ‌రిచిన జ‌గ‌న్ ?

By:  Tupaki Desk   |   16 May 2022 5:23 AM GMT
ఆహా : కాట‌న్ దొర‌ను మ‌రిచిన జ‌గ‌న్ ?
X
గోదావ‌రి జిల్లాల‌కు ప్రాణ ప్ర‌దం అయిన ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజీ రూప‌క‌ర్త, మ‌రో భ‌గీర‌థుడు అయిన కాట‌న్ దొర‌న‌కు జ‌గ‌న్ మ‌రిచిపోయారు. అంటే ఆయ‌న‌కు నివాళి ఇవ్వడం మ‌రిచిపోయారు. గోదావ‌రి నీటికి న‌డ‌క నేర్పిన కాట‌న్ దొర గురించి మ‌న పాల‌కుల‌కు తెలియ‌క‌పోవ‌డ‌మే వింత ! త‌రువాత కాలంలో అయినా ఆయ‌న్ను స్మ‌రిస్తారో లేదో మ‌రి! ఈ విష‌యంలో చంద్ర‌బాబు స్పందించారు.నిన్న‌టి వేళ సాయంత్రం ఓ పోస్టు పెట్టారు. అక్ష‌ర నివాళి అర్పించారు. ముఖ్య‌మ‌యిన సంద‌ర్భాల‌ను త‌లుచుకోవ‌డం ముఖ్య నేత‌ల బాధ్య‌త కానీ జ‌గ‌న్ మాత్రం ఎందుక‌నో మరిచిపోయారు.

"అపర భగీరథుడు ఆంగ్లేయ ఇంజినీర్ సర్ ఆర్థర్ కాటన్ జ‌యంతి సంద‌ర్భంగా ఆ మ‌హ‌నీయుని స్మృతికి నివాళుల‌ర్పిస్తున్నాను. నాడు క‌ర‌వుతో అల్లాడే గోదావ‌రి న‌దీతీర‌ ప్రాంతాల‌ను ఆన‌క‌ట్ట క‌ట్ట‌డం ద్వారా స‌స్య‌శ్యామ‌లం చేసిన మ‌హ‌నీయుడు కాట‌న్‌. ఆంగ్లేయుడైనా త‌మ త‌ర‌త‌రాల‌కు త‌ర‌గ‌ని జ‌ల‌సిరులు అందించిన‌ స‌ర్ ఆర్థ‌ర్ కాట‌న్ గోదావ‌రి జిల్లాల‌వాసులు పూజిస్తారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ధాన్యాగారంగా రూపొంద‌డానికి ప్ర‌ధాన కార‌కుడైన కాట‌న్ చిర‌స్మ‌ర‌ణీయుడు."

- నారా చంద్ర‌బాబు నాయుడు

వాస్త‌వానికి గోదావరి జిల్లాల‌లో ఎక్క‌డ చూసినా ఆయ‌న విగ్ర‌హాలు కనిపిస్తాయి. కేవ‌లం విగ్ర‌హాలే కాదు ఓ పూజ‌నీయ సంస్కృతి మ‌న‌కు కాన‌గ‌వ‌స్తుంది. రాజ‌మండ్రి అంటే గుర్తుకువ‌చ్చేవి కొన్ని, గోదావ‌రి అంటే గుర్తుకువచ్చేవి కొన్ని. కానీ ఉభ‌య గోదావ‌రి జిల్లాలలో ఇవాళ మూడు పంట‌లూ పండుతున్నాయి అంటే అందుకు కార‌ణం అతడే ! కానీ ఆయ‌న మ‌న పాల‌కుల‌కు గుర్తుకు రాడు. ఎందుకంటే ఆయ‌న ఓటు బ్యాంకు కాక‌పోవ‌చ్చు.

కాట‌న్ దొర‌కు ఉన్న ముందు చూపు ఇప్ప‌టి పాల‌కులకు లేదా అంటే లేదు. కేవ‌లం ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌తోనే కాల క్షేపం చేయ‌డం త‌ప్ప బ‌హుళార్థ సాధక ప్రాజెక్టుల నిర్మాణం అన్న‌ది చేప‌ట్ట‌డం లేదు. ఈ కోవలో వ‌చ్చే పోల‌వ‌రం ఇప్ప‌టికీ ఏ స్ప‌ష్ట‌తా లేకుండానే ఉంది. ప‌ట్టిసీమ కేవ‌లం ఓ ఎత్తిపోత‌ల ప‌థ‌క‌మే! దాని అవ‌స‌రం కూడా లేనే లేద‌ని వైసీపీ అంటోంది.

స్పిల్ వే నిర్మాణం అయిపోయినందున ప‌ట్టిసీమ అవ‌స‌రం లేనేలేద‌న్న వాద‌న ఒక‌టి వినిపిస్తోంది. ఆ విధంగా కృష్ణా డెల్టాకు పోల‌వ‌రం నీళ్లు అందే ఛాన్స్ ఉంద‌ని ఈ ఖ‌రీఫ్ కు ఆ వివ‌రం స‌ఫలీకృతం అవుతుంద‌ని భావించాలి. కానీ ఆ రోజు ఎన్నో వ్య‌య ప్రయాస‌ల‌కు ఓర్చి క‌ట్టిన ధ‌వ‌ళేశ్వరం బ్యారేజీ కానీ మ‌రికొన్ని నిర్మాణాల విష‌య‌మై కానీ ఇప్ప‌టికీ చరిత్ర‌కు ఆన‌వాళ్లుగానే కాదు జీవ‌నదుల న‌డ‌క‌కు ప్రాణ స్పంద‌న‌ల‌కు ఆలంబ‌న‌గా ఉన్నాయి.

ఒక్క మాట‌లో చెప్పాలంటే గోదావ‌రి జిల్లాల‌ను వ‌ర‌ద ముంపు నుంచి ఒడ్డెక్కించిన ఘ‌నుడాయ‌న. ఆరోగ్యం స‌హక‌రించ‌కున్నా గుర్ర‌పు స్వారీ చేస్తూ, ప్రాజెక్టు నిర్మాణ ప‌నులు వేగవంతం చేసిన దార్శినికుడు ఆయ‌న‌.