బాబు మోసాన్ని ఏపీ మహిళలు గుర్తించిన లెక్క ఇదేనా?

Fri Apr 12 2019 10:38:44 GMT+0530 (IST)

Jagan Explaines Women Voters on About Chandrababu naidu

ఏపీలో జరిగిన పోలింగ్ మీద ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. గెలుపు ధీమాను ఎవరికి వారే ప్రదర్శిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆత్మవిశ్వాసంతో గెలుపు తమదే అన్నట్లుగా వ్యవహరిస్తుంటే.. తెలుగు తమ్ముళ్లు మాత్రం ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తూ.. తమ గెలుపుకు ఉన్న అవకాశాల్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.ఇలా ఎవరి వాదన వారు వినిపిస్తున్న వేళ.. అంతిమంగా గెలిచే వారిని డిసైడ్ చేయటంలో మహిళా ఓటర్లు కీలక భూమిక పోషించారని చెప్పాలి. ఎందుకంటే.. అర్థరాత్రి వేళలో ఓటు వేయటానికి క్యూలో నిలుచున్న వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నట్లు చానళ్లు చూపించాయి.

ఇలాంటి వేళ.. ఏపీ మహిళల ఓట్లు గెలుపును డిసైడ్ చేస్తాయని చెప్పక తప్పదు. మహిళలు అత్యధికగా ఓట్లు వేస్తే.. దానర్థం ఏపీలో టీడీపీ గెలవటమేనన్న మాట వినిపిస్తోంది. పసుపు కుంకుమ పథకమే తమను విజయతీరాలకు చేరుస్తుందన్న మాట పలువురు తెలుగు తమ్ముళ్ల నోట వినిపిస్తోంది. అయితే.. ఈ వాదనను కొట్టి పారేస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.

బాబు బ్యాచ్ అంచనాల తప్పని.. పసుపు కుంకమ పథకాన్ని ఓటు వేయటానికి వారు ప్రాతిపదికగా తీసుకోరని జగన్ చెబుతున్నారు. ఎందుకంటే.. మహిళల్ని బాబు మోసం చేశారంటూ ఒక లెక్కను చెబుతున్నారు. ఈ లెక్క ఏపీలోని మహిళలు వేసుకున్నట్లుగా ఆయన వాదననువినిపిస్తున్నారు.

ఇంతకూ జగన్ చెప్పే లెక్కేమిటన్నది చూస్తే..

డ్వాక్రా అక్కచెల్లెమ్మలు బాబు చేసిన మోసాన్ని మరచిపోరు. వారికి బాబు చేసిన మోసం ఏమిటంటే.. రాష్ట్రంలో డ్వాక్రా అక్కచెల్లెమ్మలు ఒక్కో గ్రూపు కింద రూ.5 లక్షలు - రూ.7లక్షలు - రూ.10 లక్షల లోన్ తీసుకున్నారు. చంద్రబాబు వీరికి 2016 మే నుంచి సున్నా వడ్డీ వర్తించకుండా చేశారు. దీంతో రూ.5 లక్షల లోను తీసుకున్న వారు ఏటా ఒక రూపాయి వడ్డీ ప్రకారం రూ.60 వేలు - రూ.7 లక్షల లోన్ తీసుకున్న వారు రూ.84 వేలు - రూ.10 లక్షల లోన్ తీసుకున్న వారు రూ.1.20 లక్షలు వడ్డీ కట్టాల్సి వచ్చింది.

2016 మే నుంచి ఇప్పటిదాకా మూడేళ్లలో వారు (ఒక్కో గ్రూపు) వరుసగా రూ.180000 - రూ.252000 రూ.360000 వడ్డీ చెల్లించారు. చంద్రబాబు ప్రవేశ పెట్టిన  పసుపు–కుంకుమ డ్రామా కింద ఇచ్చింది కేవలం రూ.లక్ష మాత్రమే. వాస్తవానికి సున్నా వడ్డీ పథకాన్ని కొనసాగించి ఉంటే.. అక్కచెల్లెమ్మలకు ఇంకా ఎక్కువగా వచ్చి ఉండేది. ఈ లెక్కను వేసుకున్న మహిళలు బాబుకు బుద్ధి చెప్పటానికి పెద్ద సంఖ్యలో ఓట్లు వేసినట్లుగా జగన్ చెబుతున్నారు. మరి.. ఆయన చెప్పిన లెక్కను ఏపీ మహిళలు ఎంతవరకు వేసుకున్నారన్న విషయం ఎన్నికల పలితాల వెల్లడిలో తెలిసి పోతుంది. అప్పటివరకూ వెయిట్ చేయాల్సిందే.