జగన్ మార్కు జెట్ స్పీడ్...'హైపవర్' కు ఆమోదం రేపే

Fri Jan 17 2020 20:00:01 GMT+0530 (IST)

Jagan Decission on about Hypower Committee

ఏపీకి మూడు రాజధానుల దిశగా సాగుతున్న వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిజంగానే తన స్పీడుకు జెట్ స్పీడును జోడించేశారు. ఇప్పటికే పాలనలో తనదైన శైలి దూకుడును ప్రదర్శిస్తున్న జగన్... ఏపీకి మూడు రాజధానుల విషయంలో ఓ రేంజి స్పీడులో దూసుకుపోతున్నారు. అమరావతిని లెజిస్లేటివ్ కేపిటల్ కు పరిమితం చేసేసి... ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను విశాఖకు - జ్యూడిషియల్ కేపిటల్ ను కర్నూలుకు తరలించే దిశగా జగన్ తనదైన దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఇందుకు నిదర్శనమే జీఎన్ రావు కమిటీ నివేదిక - బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు నివేదిక తయారీ... ఆపై హైపవర్ కమిటీ నివేదిక రూపకల్పన అని చెప్పొచ్చు. అంతటితో ఆగని జగన్... హైపవర్ కమిటీ నివేదికకు ఆమోద ముద్ర వేసే విషయంలో జెట్ స్పీడును ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 20న జరగాల్సిన కేబినెట్ భేటీని జగన్ 18వ తేదీననే నిర్వహించేస్తున్నారు.ముందుగా జగన్ నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారం... ఈ నెల 20న కేబినెట్ భేటీని నిర్వహించి మూడు రాజదానులపై హైపవర్ కమిటీ నివేదికకు ఆమోద ముద్ర వేయాలని అనుకున్నారు. అంతేకాకుండా అదే రోజున అసెంబ్లీని సమావేశపరచి... అసెంబ్లీ ఆమోదం కూడా పొందాలని నిర్ణయించుకున్నారు. ఏమైందో తెలియదు గానీ... ఇప్పుడు కేబినెట్ భేటీని 20న కాకుండా ఆ డేట్ కు రెండు రోజుల ముందుగానే అంటే... ఈ నెల 18 (శనివారం)ననే కేబినెట్ భేటీని నిర్వహించాలని జగన్ నిర్ణయించారు. ఈ భేటీలోనే హైపవర్ కమిటీ నివేదికకు కూడా జగన్ ఆమోద ముద్ర వేయనున్నారట. ఆ తర్వాత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20న ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశంలో కమిటీ నివేదికకు అసెంబ్లీ ఆమోదం కూడా పొందనున్నారట.

మొత్తంగా మూడు రాజధానుల దిశగా సాగుతున్న జగన్ తన వేగానికి జెట్ స్పీడును యాడ్ చేశారన్న మాట. హైపవర్ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం - ఆ వెంటనే అసెంబ్లీ ఆమోదం లభిస్తే... అమరావతిలోని మెజారిటీ విభాగాలు వరుసగా విశాఖకు తరలిపోవడమే తరువాయి అన్న వాదన వినిపిస్తోంది. అయితే ఈ దిశగా జగన్ తన దూకుడును మరింతగా పెంచడానికి కారణం ఏమిటన్న విషయానికి వస్తే... శనివారం ఢిల్లీ టూర్ ను ఖరారు చేసుకున్న జగన్ కు అక్కడ తాను కలవనున్న ప్రముఖుల అపాయింట్ మెంట్లు ఇంకా ఖరారు కాలేదట. అంతేకాకుండా ఢిల్లీ వెళితే... తిరిగి వచ్చేందుకు కాస్తంత సమయం పట్టే అవకాశాలున్నందుననే ఢిల్లీ ఫ్లైటెక్కే ముందే హైపవర్ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపాలన్న దిశగా ఆలోచించిన జగన్... 20న కాకుండా రెండు రోజుల ముందుగానే కేబినెట్ భేటీని ఏర్పాటు చేస్తున్నారట.