బీ కేర్ ఫుల్: రాజధాని రియల్ ఎస్టేట్..

Wed Nov 20 2019 20:00:01 GMT+0530 (IST)

Jagan Decision on Andhra Capital

అనంతపురం టు అమరావతి.. టీడీపీ హయాంలో 6 లైన్ నేషనల్ హైవేకు ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ ప్రకటనకు ముందే హైవేల పక్కన భూములు కొని  టీడీపీ నేతలు - బినామీలు పెద్ద రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపారన్న విమర్శలు వచ్చాయి. భారీగా లాభపడ్డారని కోట్లలో చేతులు మారాయని సమాచారం.అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం రావడం.. అమరావతి నిర్మాణాలు ఆపడం.. రాజధాని కోసం కమిటీలు వేయడంతో ఈ నేషనల్ హైవే చుట్టుపక్కల భూములు కొన్న టీడీపీ నేతలు - బినామీలంతా లబోదిబోమంటున్నారు. తమ గతి ఏం కాను అని ఇప్పుడు టీడీపీతో కలిసి జగన్ సర్కారుపై ఆడిపోసుకుంటున్నారు.

అయితే తాజా ట్విస్ట్ ఏంటంటే అమరావతిపై ఎటూ తేల్చని జగన్ సర్కారు ఈ అనంతపురం టు అమరావతి హైవేను దారి మళ్లించింది. చిలకలూరిపేట వద్ద హైవేలో కలిపేలా రూట్ మార్చేస్తోంది. రాజధానిని కూడా మార్చే యోచనలో ఉండడంతో ఈ హైవే మార్పు నిర్ణయం అనూహ్య మలుపులు తిరుగుతోంది.

ఈ హైవే వస్తుందని భూములు కొన్న టీడీపీ బినామీలు - నేతలు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. అయితే వైసీపీ సర్కారు రూటు మార్చిన ఈ హైవే పక్కన ఇప్పుడు ముందస్తుగానే మరికొందరు భూములు కొనిపెట్టుకున్నట్టు సమాచారం.

ఇలా రాజధాని ఎక్కడ ఏర్పాటు అవుతుందో తెలియక అటు టీడీపీ నేతలు - ఇటు వైసీపీ నేతలు హైవే పక్కన భారీగా భూములు కొంటూ రియల్ ఎస్టేట్ దందాకు పురిగొల్పుతున్నారు. మరి జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఎవరికి లాభం కలుగుతుందనేది మాత్రం అంతుచిక్కని ప్రశ్న. ప్రభుత్వం రాజధానిని అధికారికంగా తేల్చేవరకు కూడా ఈ రియల్ దందాలో సామాన్యులు చిక్కకపోవడమే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.