Begin typing your search above and press return to search.

ఒక్క యాడ్ తో మోడీకి తానేమిటో చెప్పేసిన జగన్

By:  Tupaki Desk   |   15 Oct 2019 8:19 AM GMT
ఒక్క యాడ్ తో మోడీకి తానేమిటో చెప్పేసిన జగన్
X
స్నేహానికి తానిచ్చి విలువ ఎలా ఉంటుందన్న విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికిప్పుడు అర్థమయ్యేలా చేస్తుంటారని ఆయనకు సన్నిహితంగా ఉండేవారు చెబుతుంటారు. ఒకసారి ఒక మాట నోటి నుంచి వస్తే.. అందుకు తగ్గట్లుగా ప్లానింగ్ చేస్తారంటారు. కొన్నిసందర్భాల్లో నాలుగైదు సంవత్సరాలకు ముందే ఇచ్చిన మాటల్ని సైతం.. సమయానికి తగ్గట్లు అడగకుండానే పూర్తి చేయటం ద్వారా.. జగన్ చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటారని చెబుతున్నారు.

రాష్ట్ర నిధుల్ని కేంద్రం వాడేస్తుందని.. కేంద్రం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం తమ పేరుతో గొప్పలు చెప్పుకుంటుందన్న విమర్శలకు అవకాశం ఇవ్వకుండా ఆచితూచి అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారు. కేంద్రంలోని మోడీ సర్కారుకు తమ ప్రభుత్వం మీద అదే పనిగా ఫిర్యాదులు చేసే వారికి అసలు విషయం అర్థమయ్యేలా జగన్ తయారు చేయించిన ప్రకటన ఉందని చెప్పాలి.

చెప్పిన దాని కంటే ముందుగా.. ఇచ్చిన మాట కంటే మిన్నగా ప్రభుత్వ పథకాల్ని అమలు చేయాలన్న తన సిద్దాంతానికి తగినట్లే.. తాజాగా వైఎస్సార్ రైతు భరోసా.. సీఎం కిసాన్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది జగన్ ప్రభుత్వం. ఇందుకు సంబందించి తాజాగా ఈ కార్యక్రమాన్ని షురూ చేస్తున్నారు. మొదట చెప్పిన రూ.12వేల సాయానికి అదనంగా రూ.1500 కలిపి రూ.13,500 మొత్తాన్ని రైతులకు ఇవ్వాలని నిర్ణయించారు.

రైతులతో పాటు కౌలురైతులకు పెద్ద పీట వేయటం ద్వారా.. అందరిని సంతోషానికి గురి చేయాలన్న తీరు జగన్ సర్కారులో కొట్టొచ్చినట్లు కనిపించకమానదు. అన్నింటికి మించి..ఈ పథకానికి అవసరమైన నిధుల్లో కొంతభాగం కేంద్రం నుంచి వస్తున్న వేళ.. న్యాయంగా.. ధర్మంగా కేంద్రానికి ఇవ్వాల్సిన పేరును వారికి ఇచ్చేయటం కనిపిస్తుంది. ఈ రోజు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న వేళ.. కేంద్రం పేరును ప్రతి ప్రకటనలో కొట్టొచ్చేలా పబ్లిష్ చేయటం చూసినప్పుడు.. జగన్ విజన్ ఎలాంటిదన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.