Begin typing your search above and press return to search.

దావోస్ లో ఆసక్తికర పరిణామం.. జగన్ తో కేటీఆర్ భేటీ

By:  Tupaki Desk   |   24 May 2022 6:49 AM GMT
దావోస్ లో ఆసక్తికర పరిణామం.. జగన్ తో కేటీఆర్ భేటీ
X
ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్ లోని దావోస్ సర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎప్) సదస్సు కోసం మనదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఆయా ప్రభుత్వాల నేతలు దావోస్ కు వెళ్లారు. ఇందులో భాగంగా తమ రాష్ట్రాల్లో వ్యాపారవేత్తలు భారీ ఎత్తున పెట్టుబడులు కోరుతున్నారు. ఆయా కంపెనీల అధినేతలతో ఇందుకోసం చర్చలు జరుపుతున్నారు.

కాగా, మరోవైపు దావోస్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఫొటోలను పోస్టు చేశారు. సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ కావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందంటూ ట్వీట్ చేశారు. ఆయనతో సమావేశం గొప్పగా జరిగిందని తన ట్వీట్ లో పేర్కొన్నారు.

సాధారణంగా అయితే జగన్, కేటీఆర్ కలయికకు పెద్ద ప్రాధాన్యత ఉండేది కాదు. అయితే.. ఇటీవల ఏపీ స్థితిగతుల గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు దారుణ పరిస్థితుల్లో ఉన్నాయని తనకు తన స్నేహితులు చెప్పారంటూ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ బాంబు పేల్చారు. ఏపీతో పోలిస్తే తెలంగాణలో మంచి సౌకర్యాలు ఉన్నాయని చెప్పుకున్నారు.

నాడు కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నేతలు, మంత్రులు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. కేటీఆర్ ఏపీలో ఏ ఊరు అయినా రావొచ్చని.. అభివృద్ధి ఎలా ఉందో చూపిస్తామన్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీ నేతలు కేటీఆర్ వ్యాఖ్యలను సమర్థించారు. ఏపీ దుస్థితికి కేటీఆర్ వ్యాఖ్యలు నిదర్శనమంటూ వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ నేతలు తమపై విరుచుకుపడటం కాదని.. దమ్ముంటే కేటీఆర్ పైన విరుచుకుపడాలని సవాల్ విసిరారు. కేటీఆర్ వ్యాఖ్యలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీవ్ర ఇరకాటంలో పడ్డ సంగతి తెలిసిందే. ఎందుకంటే కేసీఆర్ తో ఏపీ సీఎం జగన్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. అటు కేసీఆర్, ఇటు జగన్ ఇద్దరూ చంద్రబాబును తమ ఉమ్మడి శత్రువుగా భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కాక రేపడంతో కేటీఆర్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తాను క్యాజువల్ గా ఆ వ్యాఖ్యలు చేశానని.. ఆ మాటల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టతనిచ్చారు. ఏపీ సీఎం జగన్ తో తమకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. తన మాటలు ఎవరినైనా గాయపరిస్తే క్షమించాలని కోరారు. ఇంతటితో ఈ వివాదాన్ని ముగించాలని ట్విట్టర్ వేదికగా విన్నవించారు.

ఈ నేపథ్యంలో కేటీఆర్.. ఏపీ సీఎం జగన్ తో స్విట్జర్లాండ్ లోని దావోస్ లో భేటీ కావడం అందరిలోనూ ఆసక్తికి కారణమైంది. అటు కేటీఆర్, ఇటు జగన్ ఇద్దరూ నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు. దీంతో కేటీఆర్ మాటలకు జగన్ బాధపడలేదనేది అర్థమవుతోందని ఇరు పార్టీల శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి.