Begin typing your search above and press return to search.

జగన్‌ అప్రమత్తం.. యాక్షన్‌ ప్లాన్‌ రెడీ!

By:  Tupaki Desk   |   7 Feb 2023 3:00 PM GMT
జగన్‌ అప్రమత్తం.. యాక్షన్‌ ప్లాన్‌ రెడీ!
X
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించాలని ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఉవ్విళ్లూరుతున్నారు. పార్టీ నేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సైతం ఇదే విషయాన్ని నూరిపోస్తున్నారు. వై నాట్‌ 175? అంటూ వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నారు.

175కి 175 సీట్ల లక్ష్యసాధనలో భాగంగా ఆరు నెలల ముందుగానే ''గడప గడపకు మన ప్రభుత్వం'' పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు లేనిచోట నియోజకవర్గ ఇంచార్జులు వారి వారి నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికీ తిరుగుతున్నారు. ఈ మూడున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లోనూ తమనే గెలిపించాలని ప్రజలను వైసీపీ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. పనిలో పనిగా సీఎం జగన్‌ ఆయా కుటుంబాలకు రాసిన లేఖలను వారి చేతుల్లో పెడుతున్నారు. దాదాపు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దాదాపు పూర్తి కావచ్చింది.

ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంపైన సీఎం జగన్‌ ఇప్పటికే రెండుమూడు సార్లు ప్రత్యేక సమావేశాలు కూడా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కోఆర్డినేటర్లతో నిర్వహించారు. సరిగా కార్యక్రమం నిర్వహించనివారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గడప గడపకు తిరగకపోతే సీటు ఇచ్చేది లేదని హెచ్చరించారు.

మరోవైపు సీఎం జగన్‌ సైతం.. ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది కార్యకర్తలను తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసుకు ఆహ్వానించి వారితో మాట్లాడుతున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల కార్యకర్తలతో జగన్‌ మాట్లాడారు.

మరోవైపు వివిధ సంక్షేమ పథకాల నగదును జమ చేయడానికి సీఎం జగన్‌ వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అక్కడ భారీ బహిరంగ సభలు నిర్వహించి ఒక వర్గం మీడియాపైన, ప్రతిపక్షాలపైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలు పేదలకు, పెత్తందార్లకు మధ్య జరిగే యుద్ధంగా అభివర్ణిస్తారు.

అలాగే కొత్తగా ''జగనన్నకు చెబుదాం'' అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొత్తగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు.

అలాగే ఈ కార్యక్రమాలే కాకుండా ఇంకా ఎన్నికలకు 15 నెలలు మాత్రమే సమయం ఉండటంతో ఏప్రిల్‌ నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర సైతం చేస్తారని సమాచారం. ఇందులో భాగంగా ప్రతి మండలంలో ఒకట్రెండు గ్రామాలను ఎంచుకుని అక్కడే నిద్ర చేస్తారని తెలుస్తోంది. గ్రామస్తులతో రచ్చబండ తరహాలో ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకుంటారని అంటున్నారు.

అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు కూడా తీసుకుంటారని చెబుతున్నారు. స్థానిక సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తారని తెలుస్తోంది. బస్సు యాత్రపై ఇప్పటికే అధికారులు కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.