ఆమె గెలవకపోతేనే ఆశ్చర్యం.. జసిండా మరోసారి గెలిపించిన న్యూజిలాండ్ ప్రజలు

Sun Oct 18 2020 17:20:08 GMT+0530 (IST)

Jacinda once again won the New Zealand people

‘కరోనాను ఆ దేశం నుంచి తరిమికొట్టగలిగింది. ప్రపంచమంతా ఉక్కిరి బిక్కిరవుతుంటే ఆమె మాత్రం తెలివిగా వ్యవహరించింది. తన ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంది. ఆమె న్యూజిల్యాండ్ ప్రధాని జసిండా ఆర్ర్డెన్.. అందరూ ఊహించినట్టుగానే ఈ సారి కూడా ఆమెను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు. ‘నేనెప్పుడూ ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ.. దేశ ప్రజలకు ఏది ముఖ్యమే దాని కోసం పనిచేస్తే.. ప్రజలను ఊహల్లో ముంచెత్తడం నాకు చేతకాదు. వాస్తవాలు చెబుతా.. వాస్తవంగా బతుకుతా’ అంటూ ఆమె తన ఆలోచన  విధానాలను ప్రజలకు చెప్పుకున్నారు. ఆ ఆలోచన ప్రజల్లో ఆమెను ఉన్నతంగా నిలిపింది. మూడేళ్ల  క్రితం న్యూజిలాండ్ ప్రజలకు మాత్రమే తెలిసిన జసిండా పేరు ఇప్పడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది.గత ఏడాది మార్చిలో ఒక ఉగ్రవాది న్యూజిలాండ్‌లో మారణహోమం సృష్టించాడు. ఆప్పుడు ఆమె ఎంత హుందాగా ప్రవర్తించారో యావత్ ప్రపంచం తెలుసుకుంది. ఇక ఇటీవల ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనాను న్యూజిలాండ్ నుంచి తరిమికొట్టి ప్రపంచ ఆరోగ్యసంస్థ ఐక్యరాజ్యసమితి సహా పలు అంతర్జాతీయ సంస్థలు ఆమె కృషిని ప్రశంసించాయి.

జెసిండా న్యూజిలాండ్‌లోని హామిల్టన్ నగరంలో 1980లో జన్మించారు. ఆమె తండ్రి పోలీసు అధికారి. తల్లి ఒక బడి క్యాంటిన్లో పని చేసేవారు.

 జసిండాది మిడిల్‌క్లాస్ ఫ్యామిలీ. కళాశాల రోజుల్లో బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌లో విద్యార్థుల తరఫు ప్రతినిధిగా వ్యవహరించినప్పుడు తొలిసారిగా ఆమెలోని నాయకత్వ లక్షణాలు బయటకొచ్చాయి. ఆ సమయంలో అమ్మాయిల యూనిఫారాల్లో ఫ్యాంట్లను ఒక భాగంగా చెయ్యాలని డిమాండ్ చేసి బోర్డును ఒప్పించారు.

కాగా ఆమె మేనత్త లేబర్ పార్టీలో సభ్యురాలు ఇది పదిహేడేళ్ళ వయసులోనే జసిండాను ఆ పార్టీ యువజన విభాగంలో (యంగ్ లేబర్ సెక్షన్) చేర్చారు. జసిండా గ్రాడ్యుయేషన్ చేశాక పరిశోధకురాలిగా న్యూజిలాండ్ పార్లమెంట్ సభ్యుడు ఫిల్ గోఫ్ కార్యాలయంలోనూ అప్పటి ప్రధాని హెలెన్ క్లర్క్ కార్యాలయంలోనూ పని చేశారు.

అనంతరం బ్రిటన్ వెళ్ళి ఆ దేశ ప్రధాని టోనీ బ్లెయిర్ విధాన నిర్ణయ బృందంలో సీనియర్ విధాన సలహాదారుగా ఉన్నారు. 2008లో అంతర్జాతీయ సోషలిస్ట్ యూత్ యూనియన్ అధ్యక్షురాలయ్యారు. అదే ఏడాది న్యూజిలాండ్ పార్లమెంట్‌కు పార్టీ తరఫున ఎంపికయ్యారు. 20017లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. మరో రెండు పార్టీలతో కలిసి లేబర్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ దేశ చరిత్రలో అతి పిన్నవయస్కురాలైన ప్రధానిగా రికార్డు సృష్టించారు. 50 లక్షల జనాభా ఉన్న న్యూజిలాండ్‌లో కరోనా మరణాల సంఖ్య పదుల సంఖ్యలోనే ఉన్నది. కేసులు కూడా చాలా తక్కువ . కరోనాను సమర్థంగా అదుపులోకి తీసుకొచ్చి ఆమె ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.