జేపీ నద్దా సంచలనం... బీజేపీ తఢాకా చూపిస్తాడట

Sun Aug 18 2019 22:38:38 GMT+0530 (IST)

JP Nadda

ఇప్పటిదాకా ఉత్తరాది పార్టీగా ముద్ర వేసుకున్న బీజేపీ... ఇప్పుడు దక్షిణాదిలోనూ సత్తా చాటే దిశగా చాలా వేగంగానే పావులు కదుపుతోంది. అందుకోసం ఆ పార్టీ అధిష్ఠానం కేంద్ర మాజీ మంత్రి పార్టీలో సౌమ్యుడిగా పేరున్న జయప్రకాశ్ నద్దాను రంగంలోకి దించింది. బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షాను కొనసాగిస్తూనే... ఆయనకు కేంద్ర హోం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి... పార్టీలో మరో పవర్ సెంటర్ ను ఏర్పాటు చేస్తూ... పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జేపీ నద్దాకు కొత్త బాధ్యతలు అప్పగించింది. కేంద్ర మంత్రిగా ఉండగా కాస్తంత మెతక మనిషేనని ముద్ర వేయించుకున్న నద్దా... ఇప్పుడు తన సత్తా ఏమిటో చాటే దిశగా సాగుతున్నారని చెప్పక తప్పదు. నద్దా తాజా వ్యవహారం చూస్తుంటే... అమిత్ షా ఆయన ముందు దిగదుడుపేనన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. ఇందుకు నిదర్శనంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభ నిలుస్తోందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.ఈ సభకు అమిత్ షా వస్తారని ప్రచారం సాగినా... ఎందుకనో గానీ షా ఢిల్లీలోనే ఉండిపోగా ఆయన స్థానంలో జేపీ నద్దా తెలంగాణలో అడుగుపెట్టారు. వచ్చీ రాగానే... టీడీపీ - కాంగ్రెస్ - టీఆర్ఎస్ ల నుంచి పెద్ద ఎత్తున బీజేపీలోకి చేరేందుకు వచ్చిన నేతలు - కార్యకర్తలను సాదరంగా ఆహ్వానించిన నద్దా... సంచలన ప్రసంగం చేశారు. తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్ఎస్ కు బీజేపీ తఢాకా ఏమిటో చూపిస్తామంటూ నద్దా చేసిన వ్యాఖ్యలు వింటుంటూ... అతి త్వరలోనే కేసీఆర్ అండ్ కోకు త్వరలోనే షాకులు తగిలే అవకాశాలున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ జేపీ నద్దా తనదైన శైలి పంచ్ డైలాగులు విసిరారు. కేసీఆర్ ను తాను వ్యక్తిగతంగా టార్గెట్ చేయనని అంటూనే... కేసీఆర్ తత్వమిదేనంటూ నద్దా సంచలన వ్యాఖ్య చేశారు. కుడిచేతితో ఇచ్చి ఎడమ చేతితో తీసుకునే రకం కేసీఆర్ అంటూ నద్దా నిజంగానే సంచలన కామెంట్ చేశారు.

అంతేకాకుండా కేసీఆర్ సచివాలయం ముఖం చూడని వైనాన్ని కూడా ప్రస్తావించిన నద్దా... సచివాలయం ముఖం కూడా చూడకుండానే కేసీఆర్ దానిని కూలగొట్టేస్తానంటూ కదులుతుండటం తనకు ఆశ్యర్యం కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో లేకున్నా కూడా తెలంగాణకు ఎయిమ్స్ ను ప్రకటించిన ప్రభుత్వం మోదీ సర్కారేనని చెప్పిన నద్దా... తెలంగాణ అంటే బీజేపీకి ఎంత ఇష్టమో ఈ ఒక్క ప్రకటనే ఉదాహరణ అని పేర్కొన్నారు. మొత్తంగా తెలంగాణ ప్రజానీకాన్ని మైమరపించేలా కేసీఆర్ అండ్ కో గుండెలు అదిరేలా సంచలన కామెంట్లు చేసిన నద్దా... సమీప భవిష్యత్తులో తెలంగాణలో జెండా ఎగురవేసేది బీజేపీనేనని చెప్పేశారన్న వాదన వినిపిస్తోంది.