Begin typing your search above and press return to search.

అదీ జేసీ అంటే.. దెబ్బకు దడుచుకొని రాజీకొచ్చారు

By:  Tupaki Desk   |   3 Aug 2021 12:30 PM GMT
అదీ జేసీ అంటే.. దెబ్బకు దడుచుకొని రాజీకొచ్చారు
X
రూల్ బుక్ ను ఫాలో అయ్యే అధికారుల్ని రాజకీయ నేతలు కూడా ఏమీ అనరు. ఒకవేళ తేడా వచ్చినా.. నాలుగైదు విమర్శలు చేస్తారే కానీ అంతకు మించి అడుగు ముందుకు వేయటానికి ఇష్టపడరు. అందుకు భిన్నంగా అధికారానికి దాసోహం అయ్యే అధికారులకు జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి మొండోడు ఎదురైతే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని ఆయన చేతల్లో చేసి చూపించారు.

సోమవారం తాడిపత్రిలో తాను ఏర్పాటు చేయనున్న రివ్యూకు రావాల్సిందిగా శనివారమే మున్సిపల్ కమిషనర్ తో సహా అధికారులకు సమాచారం అందించారు. అయితే.. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి జేసీకి పోటీగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటంతో కమిషనర్ తో సహా అధికారులంతా జేసీ పెట్టే మీటింగ్ కు రాకుండా.. ఎమ్మెల్యే ప్రోగ్రాంకు హాజరయ్యారు. తనకు మాట వరసకు కూడా సమాచారం ఇవ్వకుండా వైసీపీ ఎమ్మెల్యే ప్రోగ్రాంకు వెళ్లిన కమిషనర్ అండ్ కో.. ప్రోగ్రాం అయ్యాక తిరిగి రాకుండా తమ దారిన తాము వెళ్లిపోవటంపై రగిలిపోయారు.
అప్పటి నుంచి మున్సిపల్ కార్యాలయంలోనే ఉన్న ఆయన.. రాత్రంతా ఉండిపోవటమే కాదు.. ఉదయాన్నే స్నానాలు కూడా మున్సిపల్ ఆవరణలోనే చేయించిన తీరుతో అధికారులకు దిమ్మ తిరిగింది. తనకున్న మొండితనం ఎంతన్నది చేతల్లో చూపించిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. కమిషనర్ మొదలు మిగిలిన అధికారులంతా తన వద్దకు రావాలన్న పంతాన్ని నెగ్గించుకున్నారు. ఎమ్మెల్యే కార్యక్రమానికి వెళ్లిన అనంతరం.. మున్సిపల్ కార్యాలయానికి రావాల్సిన కమిషనర్.. సెలవు పెట్టినట్లుగా చెప్పి.. కింద అధికారుల్ని ఆఫీసుకు పంపి.. తాను బయటకు వెళ్లిపోయారు.

ఈ తీరు జేసీని మరింత రగిలిపోయేలా చేసింది. అందుకే పంతం పెట్టి మరీ.. పలు మీడియా చానళ్లతో మాట్లాడటంతో పాటు.. స్థానిక పోలీస్ స్టేషన్ లో తమ మున్సిపల్ అధికారులు కనిపించటం లేదని.. వారిని వెతికి పెట్టాలని ఫిర్యాదు చేసి సంచలనంగా మారారు. రాత్రంతా మున్సిపల్ ఆఫీసులో ఉన్న జేసీ.. ఉదయాన్నే బ్రష్ చేయటం దగ్గర నుంచి కాలక్రత్యాలన్ని అక్కడే తీర్చుకున్నారు.
అంతేకాదు.. కమిషనర్ వచ్చే వరకు అక్కడే ఉంటానని భీష్మించుకుపోవటంతో సదరు అధికారి ఉరుకులు పరుగులు పెడుతూ జేసీ వద్దకు వచ్చారు. మున్సిపల్ ఛైర్మన్ హోదాలో ఉన్న ఆయనతో భేటీకి సంసిద్ధత వ్యక్తం చేయటంతోపాటు.. జరిగిన పొరపాటును క్షమించాలని కోరటంతో.. జేసీ వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. మొత్తానికి జేసీ పంతం ఎలా ఉంటుందన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చేశారని చెప్పాలి.