జగన్ అత్యంత ప్రమాదకారి: జేసీ దివాకర్‌రెడ్డి

Sun May 22 2022 15:16:46 GMT+0530 (India Standard Time)

JC Diwakar Reddy Comments On Ys Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రమాదకారి అని మాజీ మంత్రి అనంతపురం జిల్లా టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి బాంబుపేల్చారు. ఈ విషయాన్ని తనకు స్వయంగా జగన్ తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పారన్నారు.జగన్‌తో పోల్చుకుంటే టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వెయ్యి రెట్లు బెటరని తెలిపారు. చంద్రబాబు వివాదాలను సమస్యలను చక్కగా అర్థం చేసుకుంటారని.. తర్వాత వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారని వివరించారు. జగన్ మాత్రం మూర్ఖుడని.. ఎవరూ మాట వినడని.. ఎవరినీ లెక్క చేయడని వెల్లడించారు.

ఒకసారి వైఎస్ రాజశేఖరరెడ్డి.. జగన్ గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారని జేసీ దివాకర్‌రెడ్డి వివరించారు. జగన్ ఒక దుర్మార్గుడు మూర్ఖుడని వైఎస్సార్ తనతో చెప్పుకుని బాధపడ్డారని జేసీ తెలిపారు. ఇప్పుడు జగన్ వ్యవహార శైలిని చూస్తుంటే రాజశేఖరరెడ్డి నాడు తనతో చెప్పింది నిజమేనన్న అభిప్రాయం కలుగుతుందన్నారు. జగన్‌కు గుద్దులు ముద్దులు తప్ప మరేమీ తెలియదని మండిపడ్డారు.

ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు వైఎస్ జగన్‌కు లొంగిపోయారని గుర్తు చేశారు. టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ వారిని ఆర్థికంగా జగన్ బలహీనులను చేస్తున్నారని జేసీ దివాకర్‌రెడ్డి మండిపడ్డారు. అలాగే ప్రతి చిన్న విషయానికి టీడీపీ నేతల మీద పోలీసు కేసులు పెడుతూ జైలులో వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయాక తన ముందు టీడీపీ వైఎస్సార్‌సీపీ రూపంలో రెండే ఆప్షన్ల ఉన్నాయని జేసీ తెలిపారు. దీంతో చంద్రబాబు.. జగన్ కంటే బెటరని భావించి తాను టీడీపీలో చేరానన్నారు. ఎవరైనా సలహాలిస్తే చంద్రబాబు తీసుకుంటున్నారని.. జగన్‌కు సలహా ఇస్తే జైలుకు పంపుతాడని ఎద్దేవా చేశారు. జగన్ పెద్ద అహంకారి అని దుయ్యబట్టారు.

అలాగని చంద్రబాబు దైవాంశ సంభూతుడు అని తాను చెప్పనని జేసీ అన్నారు. చంద్రబాబు కూడా మామూలు మనిషేనని.. ఆయన కూడా తప్పులు చేశారని.. అయితే వాటిని గుర్తించి సరిచేసుకుంటున్నారన్నారు. కానీ జగన్‌లో మాత్రం ఇలాంటి వ్యవహారశైలి ఉండదని చెప్పారు. వైఎస్సార్‌సీపీ నేతలు రెండే రెండింటిని అనుసరిస్తున్నారని జేసీ అంటున్నారు. జగన్ పార్టీ నేతలు బాదుడే బాదుడు నింపుడే నింపుడు కార్యక్రమాలను ఫాలో అవుతున్నారని జేసీ ఎద్దేవా చేశారు.

త్వరలోనే తాను చంద్రబాబును కలవనున్నానని.. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఆయనకు కొన్ని సలహాలిస్తానని జేసీ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కూడా ఎవరిని ఎన్నుకోవాలో బేరీజు వేసుకోవాలని జేసీ సూచిస్తున్నారు. తమకు తమ బిడ్డల భవిష్యత్‌కు మేలు చేసే పార్టీని ఎంచుకోవాలని సలహా ఇస్తున్నారు.