భూమ్మీద ఉన్న మొత్తం కరోనా వైరస్ బరువు లెక్క తెలిస్తే షాక్

Wed Jun 09 2021 15:00:00 GMT+0530 (IST)

It would be a shock to know the total weight of the corona virus on earth

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారికి సంబంధించిన సిత్రమైన లెక్కలు బయటకు వచ్చాయి. లక్షలాది మంది ఉసురు తీసుకొని.. కోట్లాది మందికి కంటికి నిద్ర లేకుండా చేసి.. యావత్ ప్రపంచాన్ని ఆగమాగం చేసిన కరోనా వైరస్ కు సంబంధించిన కొన్ని లెక్కలు తెలిస్తే.. ఆశ్చర్యానికి గురి కావటం ఖాయం. ఈ భూమ్మీద ఉన్న మొత్తం కరోనా వైరస్ బరువు ఎంతో తెలుసా? మూడున్నర కేజీలు మించదని చెబుతున్నారు ఇజ్రాయెల్ కు చెందిన శాస్త్రవేత్తలు.బలహీనుడు భయపెట్టలేదన్న వాదనకు చెక్ పెట్టేలా కరోనా లెక్కలు కనిపిస్తాయి. కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉండే ఈ మాయదారి మహమ్మారి.. క్రియేట్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. దేశాలకు దేశాల ఆర్థిక వ్యవస్థలు మొత్తాన్ని దారుణంగా దెబ్బ తీసిన కరోనా వైరస్ బరువుకు సంబంధించి వీజ్ మాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనాన్ని చేపట్టారు.

వీరి పరిశోధనలో భాగంగామనిషి శరీరంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక మోస్తరు లక్షణాలు ఉన్న వారిలో కరోనా వైరస్ లు ఎన్ని ఉంటాయి? తీవ్రత ఎక్కువగా ఉండే వారి మాటేమిటి? ఇలా లెక్కల్ని రూపొందించారు. వీటి వివరాలు చదువుతుంటే విపరీతమైన ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం కనీసం వెయ్యి.. అంతకు మించిన సంఖ్యలో కరోనా వైరస్ లు శరీరంలోకి ప్రవేశిస్తే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతకన్నా తక్కువగా ఉంటే.. ఇన్ఫెక్ష కు అవకాశం ఉండదు.

శరీరంలోకి ఒకసారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వైరస్ తనకు అనుకూలంగా ఉండే కణాల్లోకి చేరి పునరుత్పత్తి చెందటం షురూ అవుతుంది. ఇన్ ఫెక్ట్ అయిన ఒక మానవ కణంలో కొన్ని వేల వైరస్ లు ఉత్పత్తి అవుతాయి. స్వల్ప లక్షణాలతో కొవిడ్ ఉన్న వారి శరీరంలో వంద కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకు వైరస్ లు ఉండే వీలుంది.

అదే.. తీవ్రలక్షణాలతో ఉన్న వారిలో 10 వేల కోట్ల వరకు వైరస్ ఉంటుందని చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే.. ఈ భూమ్మీద ఉండే మనుషుల సంఖ్య కంటే కూడా.. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండే వ్యక్తిలోనే ఎక్కువ వైరస్ లు ఉంటాయని చెబుతారు. ఒక కరోనా వైరస్ బరువు ఎంతంటే? ఒక ఫెమ్టోగ్రామ్. అంటే ఒక గ్రాములో పది కోట్ల కోట్లవ వంతు. అంటే.. ఒకటి పక్కన 15 సున్నాలు పెడితే వచ్చే వైరస్ లు కలిపితే ఒక గ్రాము అవుతుందట.

అంటే ఒక కరోనా వైరస్ తో ఇబ్బంది పడే వ్యక్తి శరీరంలో ఉన్న వైరస్ మొత్తం బరువు ఒక మైక్రో గ్రామ్ నుంచి పది మైక్రో గ్రాములుగా చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉండే కరోనా రోగుల్లో ఉండే వైరస్ మొత్తాన్ని తూకం వేస్తే అది మొత్తం మూడున్నర కేజీలకు మించందన్న మాట చెబుతున్నారు. ఇప్పుడు చెప్పండి ఇంత మేధస్సు ఉన్న మనిషిని.. మైక్రో గ్రామ్ కంటే తక్కువ బరువున్న వైరస్ లు ఎంతలా వణికిస్తుందో కదా?