Begin typing your search above and press return to search.

ప్రభుత్వం-హైకోర్టు ఘర్షణ ఇదే మొదటిసారి కాదా?

By:  Tupaki Desk   |   14 Oct 2020 7:50 AM GMT
ప్రభుత్వం-హైకోర్టు ఘర్షణ ఇదే మొదటిసారి కాదా?
X
ప్రభుత్వానికి, న్యాయవ్యవస్ధకు ఘర్షణ జరగటం ఇదే మొదటిసారి కాదా ? అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారమైతే ఇది రెండో ఘటనగా స్పష్టమవుతోంది. గతంలో కూడా ప్రభుత్వ వ్యవహారాల్లో హైకోర్టు వ్యవహరిస్తున్న తీరుపై పెద్ద ఎత్తున కేంద్రానికి ఫిర్యాదు వెళ్ళిన విషయం వెలుగులోకి వచ్చింది. సుప్రింకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరితో పాటు ఆరుగురు జడ్జీలు చంద్రబాబునాయుడు ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డేకి జగన్ లేఖలో చాలా ఫిర్యాదులే చేశారు. ప్రభుత్వంపై వ్యవతిరేక భావనలతో కొందరు జడ్జీలు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో జగన్ ఆధారాలతో సహా ఫిర్యాదు చేయటం దేశంలో పెద్ద సంచలనమైంది. ఈ నేపధ్యంలోనే చరిత్రలో జరిగిన ఓ విషయం వెలుగు చూసింది. 1961లో ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య కూడా ఇప్పటిలాగే అప్పట్లో కేంద్ర హోంశాఖ మంత్రి లాల్ బహద్దూర్ శాస్త్రికి ఫిర్యాదు చేశారు.

అప్పట్లో చీఫ్ జస్టిస్ గా పనిచేసిన పి. చంద్రారెడ్డి తన మద్దతుదారులైన మరికొందరు జడ్జీలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ విధంగా వ్యవహరిస్తున్నారో లేఖ రూపంలో ఆరోపణలు చేశారు. హై కోర్టులో చంద్రారెడ్డి ఏ విధంగా గ్రూపిజంకు పాల్పడుతున్నారు అనే విషయాన్ని కూడా సంజీవయ్య వివరించారు. ప్రభుత్వం అందచేసిన ఎయిర్ కండీషనర్లను కేవలం తన మద్దతుదారులైన కొందరు జడ్జీలకు మాత్రమే కేటాయించిన విషయాన్ని వివరించారు.

చంద్రారెడ్డి వ్యవహారశైలి ద్వారా న్యాయవ్యవస్ధకు జరుగుతున్న నష్టంపై అనేక ఆధారాలిచ్చారు. తన మద్దతుదారులుగా ముద్రపడిన జిల్లా జడ్జీలను హైకోర్టు జడ్జీలుగా ఎలా ప్రమోట్ చేస్తున్నారనే విషయంపైన కూడా దామోదరం ఫిర్యాదులు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేరకంగా దాఖలవుతున్న కేసులను తన మద్దతుదారులున్న బెంచీలే విచారణ జరిపించేట్లుగా చంద్రారెడ్డి మ్యానేజ్ చేస్తున్నారనే విషయంపై తన లేఖలో మండిపోయారు. అంటే ఇప్పుడు జగన్ చేసిన ఫిర్యాదులకు అప్పట్లోనే సంజీవయ్య చేసిన ఫిర్యాదులకు కొన్ని సారూప్యతలున్న విషయం గమనార్హం.