Begin typing your search above and press return to search.

టీడీపీలో కొత్త సంక‌టం.. మేయ‌ర్ అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న అంత ఈజీకాదా?!

By:  Tupaki Desk   |   26 Feb 2021 5:30 PM GMT
టీడీపీలో కొత్త సంక‌టం.. మేయ‌ర్ అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న అంత ఈజీకాదా?!
X
ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ మ‌రో కొత్త స‌మ‌స్య‌ను ఎదుర్కొంటోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న స‌మ‌స్య‌ల‌కు ఇది తోడైంది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో నాయ‌కుల‌ను ప్ర‌చారానికి వెళ్లాల‌ని.. టీడీపీని బ‌లోపేతం చేయాల‌ని చంద్ర‌బాబు పిలుపునిస్తున్నారు. అయితే.. నాయ‌కులు వెళ్తున్నాం.. వెళ్తున్నాం.. అంటున్నారే త‌ప్ప‌.. ఎక్క‌డా ఆ మేర‌కు క‌ద‌లిక క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో అస‌లు స‌మ‌స్య ఏంట‌నే విష‌యంపై దృష్టి పెట్టిన చంద్ర‌బాబు.. మేయ‌ర్ పీఠాల వెల్ల‌డితోనే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. అంటే.. మేయ‌ర్ అభ్య‌ర్థులు ఎవ‌రో తెలియ‌కుండా తాము ప్ర‌చారం చేయ‌లేమ‌ని.. సీనియ‌ర్లు తేల్చేసిన‌ట్టు క‌నిపిస్తోంది.

దీంతో ఇప్పుడు మేయ‌ర్ అభ్య‌ర్థుల ఎంపిక‌పై చంద్ర‌బాబు దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం. మేయర్‌ అభ్యర్థులను ముందుగానే ఖరారు చేస్తే.. ఎన్నికల ప్రచారంలో ఊపు వస్తుందని, నాయకులు బలంగా పనిచేస్తారని భావిస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గత రెండ్రోజులుగా విశాఖ, విజయవాడ, గుంటూరు నేతలతో చర్చలు జరుపుతున్నారు. గుంటూరు కార్పొరేషన్‌ మేయర్‌ అభ్యర్థి రేసులో ముగ్గురు ఉన్నారు. వీరిలోనూ బ‌ల‌మైన రాయ‌పాటి, కొమ్మాల‌పాటి కుటుంబాలు ఉన్నాయి. అయితే.. యువ నాయ‌కుడు కోవెలమూడి రవీంద్ర (నాని) పేరును ఖరారు చేసినట్లు సమాచారం.

ఇక‌, విజయవాడ మేయ‌ర్ పీఠం విష‌యంపై లోపాయికారీగా సాగుతున్న అంత‌ర్గ‌త పోరుపైనా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఎంపీ నాని, ఇతర నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే 39వ డివిజ‌న్ అభ్య‌ర్థి, బీ-ఫాం ఇచ్చిన పార్టీ అభ్యర్థి పూజితను కొనసాగించాలని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్‌ మీరా కోరారు. కానీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడ శివశర్మ అనే నేతకు ఇవ్వాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని విజ్ఞప్తి చేశారు. స్థానిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని శివశర్మ అభ్యర్థిత్వానికే అధిష్టానం మ‌ద్ద‌తు తెలిపింది.

విజయవాడ, విశాఖల్లో మేయర్‌ అభ్యర్థిత్వాలపై కూడా కసరత్తు చేశారు. విజయవాడ కార్పొరేషన్‌కు కేశినేని నాని కుమార్తె శ్వేత పేరు ప్రతిపాదనలో ఉంది(వాస్త‌వానికి గ‌త ఏడాదే ఖ‌రారు చేశారు). విజయవాడ నగరంలోని పార్టీ ముఖ్య నేతలతో సంప్రదించి దీనిపై తుది నిర్ణయానికి రావాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. విశాఖ కార్పొరేషన్‌కు మేయర్‌ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరును ప‌రిశీల‌న‌లోకి తీసుకుంటున్నారు. ఇటీవ‌ల ఉక్కు ఉద్య‌మంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఈయ‌న అయితే.. సెంటిమెంటు ప‌రంగా బాగుంటుంద‌ని భావిస్తున్నారు. ఇలా.. మొత్తంగా మేయ‌ర్ పీఠాల‌పై ఒక క్లారిటీ వ‌చ్చాక‌.. ప్ర‌చారాన్ని ప‌రుగులు పెట్టించాల‌ని నిర్ణ‌యించారు.