Begin typing your search above and press return to search.

ఏపీ ప్రజలు ఆయా పార్టీల నుంచి కోరుకుంటున్నది ఇదేనా?

By:  Tupaki Desk   |   30 Jan 2023 6:29 PM GMT
ఏపీ ప్రజలు ఆయా పార్టీల నుంచి కోరుకుంటున్నది ఇదేనా?
X
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికలకు ఇంకా ఏడాదికిపైగా సమయం ఉన్నప్పటికీ అప్పుడే అన్ని పార్టీలు తమ వ్యూహాలు, ప్రతి వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. నవరత్న పథకాల అండతో మరోమారు వైసీపీ అధికారంలోకి రావాలని పెద్ద ఆశలే పెట్టుకుంది. టీడీపీ సైతం జనసేన పొత్తు, లేదా ప్రస్తుతం ఉన్న పథకాలకు తోడుగా మరిన్ని పథకాలను ప్రవేశపెడతామని చెప్పి అధికారంలోకి రావాలని తపిస్తోంది. ఇప్పటికే తాము అధికారంలోకి వస్తే ఏ పథకాన్ని రద్దు చేయబోమని టీడీపీ చెబుతోంది. అంతేకాకుండా ఆయా పథకాలను ఇంకా మెరుగ్గా అందిస్తామని హామీ ఇస్తోంది.

మరోవైపు వైసీపీ ప్రథానంగా పెన్షన్ల పెంపు, మహిళలకు ఇంటి స్థలాలు, డ్వాక్రా రుణాల మాఫీ వంటివాటితో సులువుగా విజయం సాధిస్తామని లెక్కలేసుకుంటోంది. పెన్షన్లు తీసుకునేవారు 64 లక్షల మంది, ఇంటి పట్టాలు అందుకున్న 35 లక్షల మంది మహిళలు, డ్వాక్రా రుణాల మాఫీతో లబ్ధి పొందిన 90 లక్షల మంది తమకే ఓటేస్తారని వైసీపీ భారీ ఆశల పల్లకిలో ఉంది. తద్వారా కోటిన్నర మంది పక్కాగా తమకే ఓటేస్తారని లెక్కలేసుకుంటోంది.

మరోవైపు టీడీపీ సైతం తాము అధికారంలోకి వస్తే ఏ పథకాన్ని రద్దు చేయబోమని చెబుతోంది. ఇంకా మెరుగ్గా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తే ఇంకా కొత్త పథకాలకు కూడా రూపకల్పన చేస్తామని అంటోంది.

ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం లెక్కకు మిక్కలిగా పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతు భరోసా, పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, మహిళలకు ఇళ్ల పట్టాలు, డ్వాక్రా కుణాల మాఫీ. వైఎస్సార్‌ ఆసరా, జగనన్న చేదోడు, జగనన్న విద్య కానుక, జగనన్న విద్యా వసతి, జగనన్న వసతి దీవెన, మత్స్యకార భరోసా, వాహనమిత్ర, అమ్మ ఒడి, జగనన్న తోడు, వైఎస్సార్‌ జలకళ ఇలా లెక్కకు మిక్కిలి పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలే తమకు మరోమారు విజయం సాధించిపెడతాయనే ఆశల్లో ఉంది.

ప్రజలు కూడా ఈ పథకాలన్నీ తమకు కొనసాగుతూనే ఉండాలని కోరకుంటున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం మారినా ఈ పథకాలు కొనసాగాలని.. అయితే ఇంకా మెరుగ్గా అందించాలని కోరుతున్నారని అంటున్నారు. వివిధ అర్హతల పేరుతో కొన్ని లక్షల మందికి పథకాలు తొలగించారని.. అలా కాకుండా అందరికీ ఈ పథకాలు అందజేయాలని ఆశిస్తున్నారు.

మరోవైపు ఆర్థిక నిపుణులు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇబ్బడిముబ్బడిగా వైసీపీ ప్రభుత్వం అప్పులు తెచ్చి ఉచిత పథకాల పేరిట పందేరాలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. దీనివల్ల ఏపీ కూడా శ్రీలంకలా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవచ్చని పేర్కొంటున్నారు.

ఇదిలా ఉంటే ఉచిత పథకాలకు అలవాటుపడిన ప్రజలు వచ్చే ప్రభుత్వం ఏదైనా తమకు పథకాలు అమలు చేయాలని కోరుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం సైతం తాము అమలు చేస్తున్న పథకాలు దేశంలో మరెక్కడా లేవని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఇస్తున్న మొత్తాలను వచ్చే ప్రభుత్వం మరింత పెంచాలని లబ్ధిదారులు ఆశిస్తున్నారని పేర్కొంటున్నారు. టీడీపీ, జనసేన సైతం తాము అధికారంలోకి వస్తే పథకాలను మరింత మెరుగ్గా అమలు చేస్తాయని చెబుతున్నాయి. తద్వారా ప్రజలు కోరుకుంటున్నదేదో ఆ రెండు పార్టీలు అవగతం చేసుకున్నట్టే కనిపిస్తోందని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.