Begin typing your search above and press return to search.

బీజేపీని వదుల్చుకోవ‌డానికి ప‌వ‌న్ కి ఇదే స‌రైన స‌మ‌య‌మా?

By:  Tupaki Desk   |   27 Jun 2022 8:32 AM GMT
బీజేపీని వదుల్చుకోవ‌డానికి ప‌వ‌న్ కి ఇదే స‌రైన స‌మ‌య‌మా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌న‌సేన పార్టీ, బీజేపీల మ‌ధ్య పొత్తు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు పార్టీలు ఎప్పుడూ క‌ల‌సి ఉమ్మ‌డిగా ఏ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిందీ లేదు. అలాగే ఎన్నిక‌ల్లోనూ సంయుక్తంగా ప్ర‌చారం చేసిందీ లేదని రాజకీయ ప‌రిశీల‌కులు అంటున్నారు. ఇటీవ‌ల జ‌న‌సేన పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జులు, పార్టీ జిల్లాల అధ్య‌క్షుల‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ పొత్తుల విష‌యంలో త‌న ముందు మూడు ఆప్ష‌న్లు ఉన్నాయ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే దీనిపై అటు టీడీపీ నుంచి, ఇటు బీజేపీ నుంచి ఎలాంటి ప్ర‌కట‌న‌లు వెలువ‌డ‌లేద‌ని గుర్తు చేస్తున్నారు. ఆ రెండు పార్టీలు ఏమీ ఎర‌గ‌నట్టు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌ట‌న‌పై సైలెంట్ గా ఉండిపోయాయంటున్నారు.

పైగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా ఏపీలో ప‌ర్య‌టించిన‌ప్పుడు బీజేపీ సొంతంగా అధికారంలోకి రావాల‌ని పిలుపునిచ్చారని విశ్లేష‌కులు గుర్తు చేస్తున్నారు. ఎక్క‌డా ఆయ‌న జన‌సేన పార్టీ, ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తావ‌న తేలేదని చెబుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పార్టీని బ‌లోపేతం చేసి బీజేపీని సొంతంగా అధికారంలోకి రావాల‌నే మాత్ర‌మే జేపీ న‌డ్డా పార్టీ నేత‌లకు సూచించార‌ని అంటున్నారు. దీంతో జ‌న‌సేన -బీజేపీ సంబంధాలు అంత మెరుగ్గా లేవ‌నేది అర్థ‌మైంద‌ని పేర్కొంటున్నారు.

బీజేపీని వ‌దుల్చుకోవ‌డానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఇదే స‌రైన స‌మ‌యమ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరులో పోటీ చేసి బీజేపీ ప‌రువు పోగొట్టుకుంద‌ని చెబుతున్నారు. క‌నీసం డిపాజిట్ కూడా ద‌క్కించుకోలేద‌ని పేర్కొంటున్నారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసిన బీజేపీకి క‌నీసం ఒక్క శాతం ఓట్లు కూడా రాలేద‌ని గుర్తు చేస్తున్నారు. అలాగే బ‌ద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక‌, తిరుప‌తి ఎంపీ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లోనూ బీజేపీ డిపాజిట్లు కోల్పోయింద‌ని అంటున్నారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ను అడ్డు పెట్టుకుని బీజేపీ లాభ‌ప‌డుతోంద‌ని.. బీజేపీ వ‌ల్ల‌ ప‌వ‌న్ కి వీస‌మెత్తు ప్ర‌యోజనం లేద‌ని చెబుతున్నారు. ప‌వ‌న్ తో పొత్తు పెట్టుకుని ఒక‌టి రెండో అసెంబ్లీ సీట్లు, అలాగే పార్ల‌మెంటు సీట్లు గెలుచుకోవాల‌నే ప్లాన్ లో బీజేపీ ఉంద‌ని అంటున్నారు.

జ‌న‌సేన గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయినా దాదాపు ఏడు శాతం ఓట్లు సాధించింద‌ని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ పెద్ద పార్టీనా లేక జ‌న‌సేన పెద్ద పార్టీనా అంటే జ‌న‌సేన పెద్ద పార్టీఅని దీన్ని బ‌ట్టే చెప్పొచ్చు అంటున్నారు. అందువ‌ల్ల బీజేపీ పొత్తు నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి ప‌వ‌న్ కు ఆత్మ‌కూరు ఉప ఎన్నిక అవ‌కాశం క‌ల్పించింద‌ని వివ‌రిస్తున్నారు.

బీజేపీతో పొత్తు వ‌ల్ల ముస్లింలు, ఎస్సీలు జ‌న‌సేన‌కు దూర‌మ‌య్యే ప్ర‌మాదం కూడా ఉంద‌ని అంటున్నారు. ఏ విధంగా చూసినా బీజేపీతో పొత్తు ప‌వ‌న్ కు చేటే కానీ మేలు కాద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్ప‌టికైనా ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ప‌వ‌న్ బీజేపీ పొత్తు నుంచి బ‌య‌ట‌ప‌డితే ఆయ‌న‌కే మంచిద‌ని చెబుతున్నారు.