Begin typing your search above and press return to search.

తృణమూల్ మెజారిటీలకు కారణం ఇదేనా ?

By:  Tupaki Desk   |   2 May 2021 6:37 AM GMT
తృణమూల్ మెజారిటీలకు కారణం ఇదేనా ?
X
పశ్చిమబెంగాల్లో కౌంటింగ్ లో విచిత్రపరిస్ధితులు కనబడుతున్నాయి. అదేమిటంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మెజారిటి స్ధానాల్లో దూసుకుపోతుంటే ఆ పార్టీ అధినేత్రి, సీఎం మమత బెనర్జీ మాత్రం వెనకబడున్నారు. బెంగాల్లో కౌంటింగ్ మొదలైన దగ్గర నుండి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాదాపు వాస్తవంలోకి వస్తున్నట్లే ఉంది. ఇప్పటికి 294 సీట్లలో తృణమూల్ అభ్యర్ధులు 175 సీట్లలో మెజారిటిలో ఉంటే బీజేపీ అభ్యర్ధులు 108 సీట్లలో ముందంజలో ఉన్నారు.

ప్రచారంలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడిన రెండుపార్టీలు కౌంటింగ్ లో కూడా హోరా హోరీగానే సాగుతోంది. కాకపోతే టీఎంసీ మెజారిటిలో ఉందంతే. ఇపుడు జరుగుతున్నదంతా మూడు, నాలుగో రౌండ్ల ఓట్ల లెక్కింపు మాత్రమే. మరో మూడు రౌండ్లు జరిగితే మెజారిటిలు మారిపోయే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పటి మెజారిటిలే చివరివరకు కంటిన్యు అవుతాయని చెప్పేందుకు లేదు.

కాకపోతే ఇప్పటి మెజారిటికి సంబంధించి ఓ విషయం స్పష్టమైపోతోంది. అదేమిటంటే బెంగాల్లోని ముస్లిం మైనారిటిల ఓట్లంతా గంపగుత్తగా తృణమూల్ కు అనుకూలంగా పడ్డాయని. బెంగాల్లో మొదటినుండి ముస్లిం ఓట్లు సీపీఎం వైపే మొగ్గుచూపుతుండేవి. తృణమూల్ పార్టీ పెట్టినతర్వాత మెజారిటి ముస్లింలు మమతాబెనర్జీకి మద్దతుగా నిలబడ్డారు. రెండు ఎన్నికలు ఇలాగే మద్దతుగా నిలబడిన ముస్లింలు 2019 ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలబడ్డారు.

దాంతో పరిస్ధితిని గ్రహించిన మమత మళ్ళీ ముస్లింలను దగ్గరకు చేర్చుకునేందుకు చాలానే కష్టపడ్డారు. ఇదే సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందువుల ఓట్లకోసం ముస్లింలు, మమతను మోడి, అమిత్+బీజేపీ నేతలు బూచిగా చూపారు. దాంతో ముస్లింల్లో పునరాలోచన మొదలైంది. అదే విషయం పోలింగ్ లోను ఇపుడు కౌంటింగ్ లో స్పష్టంగా కనిపిస్తోంది.

టీఎంసీకి ఇన్ని సీట్లలో మెజారిటి రావటానికి ముస్లింల ఏకఫక్ష ఓటింగే అనే విశ్లేషణలు మొదలైపోయాయి. ఎందుకంటే 294 నియోజకవర్గాల్లో ముస్లింఓట్లదే 74 నియోజకవర్గాల్లో ఆధిక్యత. అలాగే మరో 30 నియోజకవర్గాల్లో గెలుపోటములను డిసైడ్ చేయగలిగే స్ధాయిలో ఉంది. కాబట్టే టీఎంసీకి ఇంతటి మెజారిటిలు వస్తున్నట్లు అర్ధమవుతోంది. హిందువుల ఓట్లను ప్రధాన పార్టీలు చీల్చుకున్నా ముస్లింఓట్లు మమత వైపు మొగ్గుచూపినట్లు అర్ధమైపోతోంది.