ఈ టీడీపీ ఎంపీ ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారా?

Fri Sep 30 2022 16:12:55 GMT+0530 (India Standard Time)

Is this TDP MP contesting the assembly elections this time?

విజయవాడ ఎంపీ కేశినేని నాని గత రెండు పర్యాయాలు 2014 2019ల్లో వరుసగా విజయవాడ ఎంపీగా గెలుపొందారు. 2019లో వైసీపీ సునామీని తట్టుకుని మరీ గెలిచిన ముగ్గురు టీడీపీ ఎంపీల్లో కేశినేని నాని ఒకరు. అయితే గత కొంతకాలంగా విజయవాడలో టీడీపీలోనే కీలకంగా ఉన్న బుద్ధా వెంకన్న నాగుల్ మీరా మాజీ ఎమ్మెల్యే బొండా ఉమలతో కేశినాని నానికి విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ విభేదాలు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లోనూ బయటపడ్డాయి. విజయవాడ మేయర్ అభ్యర్థిగా టీడీపీ తరఫున కేశినేని శ్వేతను బరిలోకి దించారు. దీనికి మిగతా నేతలు అభ్యంతరం తెలిపారు.అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్‌లకు అత్యంత విశ్వసనీయ పాత్రులుగా బుద్ధా వెంకన్న నాగుల్ మీరా ఉన్నారు. దీంతో వారికే చంద్రబాబు మద్దతు ఇస్తున్నారని కేశినేని నానిలో అభిప్రాయం ఉందని అంటున్నారు. దీంతో అప్పటి నుంచి టీడీపీ అధిష్టానంతో అంటీముట్టనట్టు కేశినేని నాని వ్యవహరిస్తున్నారు. సాక్షాత్తూ ఇటీవల చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఆయనకు పుష్పగుచ్ఛం ఇవ్వడానికి నిరాకరించి నాని కలకలం రేపారు.

మరోవైపు ఇప్పటికే తాను విజయవాడ ఎంపీ పదవికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని కేశినేని నాని.. చంద్రబాబుకు తేల్చిచెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్నికి టికెట్ ఇవ్వవచ్చని అంటున్నారు. కేశినేని చిన్ని ఇటీవల టీడీపీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాతోనూ భేటీ అయ్యారు. మరోవైపు అన్నదమ్ముల మధ్య విబేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో కేశినేని నాని బీజేపీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. బీజేపీలో చేరకపోతే విజయవాడ తూర్పు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని చెబుతున్నారు. విజయవాడ తూర్పు నుంచి టీడీపీకి చెందిన గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లోనూ ఆయనే గెలుపొందారు. గతంలో ఆయన గన్నవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. అలాగే విజయవాడ ఎంపీగానూ పనిచేశారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గద్దె రామ్మోహన్‌ను విజయవాడ లోక్‌సభ నుంచి లేదా గన్నవరం ఎమ్మెల్యేగా పోటీ చేయించవచ్చని అంటున్నారు. అలాంటప్పుడు విజయవాడ తూర్పు నుంచి కేశినేని నాని టీడీపీ తరఫున అసెంబ్లీకి పోటీ చేస్తారని చెబుతున్నారు. కేశినేని నాని మనసులోనూ ఈ ఉద్దేశం ఉందని అంటున్నారు.

అయితే తాను అసెంబ్లీకి పోటీ చేస్తాననే విషయం కేశినేని నాని ఇంకా చంద్రబాబుకు చెప్పలేదని సమాచారం. మరోవైపు వైసీపీ తరఫున దేవినేని అవినాష్ విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గుడివాడ నుంచి పోటీ చేసిన దేవినేని అవినాష్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.