Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేల పరిస్థితి అలా అయిపోయిందా... ?

By:  Tupaki Desk   |   26 Jan 2022 3:30 PM GMT
ఎమ్మెల్యేల పరిస్థితి అలా అయిపోయిందా... ?
X
ఎమ్మెల్యే అంటే ఒక విధంగా రాజుగానే అంతా చూస్తారు. లక్షల జనాలకు ప్రతినిధి. ఆయన మాటే ఎటు చూసినా చలామణీ అవుతుంది. నిజంగా ఎమ్మెల్యే రాజసం గురించి తలచుకోవాలీ అంటే ఇప్పటికి కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్లాల్సిందే. కాంగ్రెస్ జమానాలో ఎమ్మెల్యేలు అంటే అచ్చమైన కింగులే. ఆనాడు ఒక వార్డు కౌన్సిలర్ కి కూడా అంత పవర్ ఉండేది. ఆయన సంతకం కోసం జనాలు క్యూలు కట్టిన రోజులు ఉన్నాయి.

అయితే తరువాత రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ఒక్క ఎన్టీయార్ ఎంతో మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. అలా పాలిటిక్స్ లో కేంద్రీకృత విధానం ఆనాడే మొదలైంది. ఒక దశలో అది మితిమీరింది కూడా. వ్యక్తులతో పనే లేదు, ఎవరికి టికెట్ ఇచ్చినా బేఫికర్, ఒక్క నాయకుడి ఇమేజ్ మీదనే ఎవరైనా గెలుస్తారు అన్న చీప్ అభిప్రాయాన్ని కూడా భజపరులు ప్రచారం చేస్తూ వచ్చారు.

టీడీపీ ఎంట్రీ తరువాత కాంగ్రెస్ కూడా తన పొలిటికల్ షేప్ ని మార్చుకోవాల్సి వచ్చింది. అక్కడ కూడా నాయకుల సమూహం మాయమై వ్యక్తులు వారి ఇమేజ్ ముందుకు వచ్చేశాయి. వైఎస్సార్ అలా తన ఇమేజ్ తో కాంగ్రెస్ ని రెండు సార్లు గెలిపించారు. అన్న పేరు తెచ్చుకున్నారు. ఇక విభజన తరువాత కాంగ్రెస్ కానరాక టీడీపీ, వైసీపీ రెండే ప్రాంతీయ పార్టీలుగా ఏపీలో మిగిలాయి. తెలంగాణాలో టీయారెస్ కూడా అచ్చమైన ప్రాంతీయ పార్టీఎ.

ఒక విధంగా చెప్పాలంటే ఏక వ్యక్తి శాసనంతో నడిచే పార్టీలు ఇవన్నీ. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో కూడా ఇలాగే సీన్ ఉంది. మోడీ ఇమేజ్ తో బీజేపీ వెలిగిపోతోంది అని అంటారు. అనేక పార్టీలలో తీరు తెన్నులు చూశాకా ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్దగా వెలిగిపోవడంలేదు. అంత దాకా ఎందుకు మంత్రులు కూడా కొందరు తప్ప అందరూ జనాలకు తెలిసే సీన్ లేకుండా పోతోంది.

ఇక అంతా సీఎం, ప్రధానుల పేరు మీదనే సాగుతున్న రాజకీయ కధలో ఎమ్మెల్యేలు ఏదైనా ప్రారంభించాలీ అన్నా కుదిరే వ్యవహరమే కాదు, మరో వైపు అభివృద్ధి కూడా బ్రహ్మపదార్ధం అయిపోతోంది. ఏ చిన్న ప్రొగ్రాం అయినా ముఖ్యమంత్రులే చేయాలన్న రాజనీతి పెరిగిపోయింది. దీంతో అభివృద్ధి అసలే లేక ఏం చేయాలో తోచక ఎమ్మెల్యేలు ఏం చేస్తారు పాపం.

కొందరైతే చివరికి సెలూన్ల ఓపెనింగ్ కి కూడా వెళ్తున్నారు. మరి కొందరు బట్టల షాపులకు రిబ్బన్ కట్ చేస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా నగరిలో చూస్తే ఎమ్మెల్యే రోజా ఒక వెటర్నరీ మెడికల్ షాప్ ని ప్రారంభించి ఫోటోలకు కనిపించారు. నిజానికి అవన్నీ ప్రైవేట్ బిజినెస్ లు, వాటిని ఓపెన్ చేయకూడదు అని కాదు, ఎమ్మెల్యేలు జనాలకు బాధ్యులు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని ప్రారంభిస్తే వారికీ పేరు, జనాలకు అది గుర్తు ఉంటుంది.

కానీ విషాదం ఏంటి అంటే అలాంటి అభివృద్ధి అన్నది కనిపించడంలేదు అన్నదే జనం బాధ. ఆఖరుకు పరిస్థితి ఎంత దూరం వెళ్తోంది అంటే ఎప్పటికపుడు రిపేర్లు చేయాల్సిన రోడ్లే పెద్ద ఎత్తున గుంటలు పడి నోరెళ్ళబెడుతున్న దీన స్థితి. అలాంటి రోడ్లకు రిపేర్లు చెసినా అదే అభివృద్ధి అనే చెప్పుకునే దాకా సీన్ వెళ్తోంది. ఎందుకంటే ఇపుడు వాటిని కూడా బాగుచేయడంలేదు అన్న విమర్శలు వస్తున్నాయి కాబట్టి. మరి ఇవన్నీ చూసి కూడా ఎమ్మెల్యేలుగా కిరీటం పెట్టుకుందామని ఎవరైనా వస్తారా అంటే. ఏమో రాజకీయం ఎపుడూ అలా సాగుతూనే ఉంటుంది. మార్పు వస్తుందేమో. మళ్ళీ రాజులుగా వెలిగే రోజులు వస్తాయేమో. అలా రావాలని కూడా జనాలు కోరుకుంటున్నారు. ఎందుకంటే అభివృద్ధి వారికి కావాలి కాబట్టి.