అమెరికాలో భారతీయుల పరిస్థితి ఇంత ఘోరమా?

Thu Jun 10 2021 10:34:57 GMT+0530 (IST)

Is the situation of Indians in America so bad?

ఏ దేశ మేగినా.. ఎందుకాలిడినా మన భారతీయులపై వివక్ష మాత్రం కొనసాగుతూనే ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అయితే ఇది మరింత పెచ్చుమీరుతోంది. అమెరికన్ల దురంహకారానికి భారతీయులు అవమానాలకు గురి అవుతూనే ఉన్నారు.అమెరికా ఇప్పుడు అగ్రరాజ్యంగా ఎదిగిందంటే కేవలం వారి ప్రతిభతోపాటు వలస వచ్చిన వారి కృషి ఎంతో ఉంది.. ముందుగా అమెరికాను ఆక్రమించుకొని అభివృద్ధి చేసిన బ్రిటన్ వారిది..ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వలస వచ్చిన వారి మేధో ఆర్థిక పెట్టుబడితో ఈరోజు ప్రపంచంలోనే నంబర్ 1 ఎదిగింది. అమెరికా జాతి నిర్మాణంలో రక్తం చిందించిన నల్లజాతీయుల పాత్ర ఎంతో ఉంది. అయితే వారు ఇప్పటికీ ఆ దేశంలో రెండో శ్రేణి పౌరులుగా ఉండడం అక్కడి జాత్యాంహకారానికి నిదర్శనంగా చెప్పొచ్చు.

అగ్రరాజ్యం అమెరికాకు వలసవచ్చిన వారిలో భారతీయులదే రెండో స్థానం కావడం విశేషం. అయినప్పటికీ అమెరికాలో భారతీయులపై వివక్ష వేధింపులు కొనసాగుతున్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది.

‘సోషల్ రియాలిటీస్ ఆఫ్ ఇండియన్ అమెరికన్స్’ పేరిట 2020లో కార్నెగి ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషన్ పీస్ జాన్స్ హ్యాప్కిన్స్-ఎస్ఏఐఎస్ యూనివర్సిటీ పెన్సిల్వేనియా సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వే నివేదికను బుధవారం విడుదల చేశారు.

సర్వేలో భాగంగా అమెరికాలో నివసించే 1200 మంది భారతీయ అమెరికన్లను గత ఏడాది సెప్టెంబర్ 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా ప్రశ్నించారు. అమెరికాలో వివక్షను ఎదుర్కొంటున్నామని ప్రతి ఇద్దరిలో ఒకరు చెప్పారు. తమ చర్మం రంగు భాష వేషధారణపై అవహేళనకు గురయ్యామని తెలిపారు. అమెరికాలో పుట్టిన భారత సంతతికి ఈ వివక్ష తప్పడం లేదంటున్నారు.  భారతీయ తండ్రి - అమెరికా తల్లి భారతీయ తల్లి - అమెరికా తండ్రికి పుట్టిన వారు సైతం ఇలాంటి వివక్షనే ఎదుర్కొంటున్నట్లు వాపోవటం గమనార్హం.

అమెరికాలోనూ మనోళ్ల కుల పిచ్చి తగ్గడం లేదని తేలింది. ఇండియాలో పుట్టి అమెరికాకు వెళ్లిన వారు తమ పేరుతో పాటు.. తాము ఏ కులానికి చెందిన వారిమన్న విషయాన్ని వదులుకోవటానికి ఇష్టపడటం లేదని తేలింది. అదే సమయంలో వారి పుట్టిన సంతానం మాత్రం కులానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరని తేలింది. మొత్తం హిందువుల్లో ప్రతి పది మందిలో ఎనిమిదిమంది తమ కులంపై ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించటం గమనార్హం.

భారతీయ అమెరికన్ల జీవితాల్లో మతం కీలకపాత్రను పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. రోజుకు ఒకసారైనా ప్రార్థన చేస్తామని 40 శాతం మంది చెబితే.. వారంలో ఒక్కరోజైనా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటామని 27 శాతం మంది చెప్పటం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కులాన్నికూడా భారతీయ అమెరికన్లు విడిచిపెట్టటం లేదన్న విషయం తాజా సర్వేలో వెల్లడైంది. ఇలా మనోళ్ల ప్రాంతీయ అభిమానం అమెరికాలో అమెరికన్ల చేతిలో వివక్షకు కారణమవుతోందని తేలింది.