Begin typing your search above and press return to search.

ప్రభుత్వం వాదన సుప్రింకోర్టులో చెల్లుతుందా ?

By:  Tupaki Desk   |   23 Jan 2021 6:10 AM GMT
ప్రభుత్వం వాదన సుప్రింకోర్టులో చెల్లుతుందా ?
X
పంచాయితి ఎన్నికల వివాదంలో ప్రభుత్వం వాదన సుప్రింకోర్టులో చెల్లుబాటవుతుందా ? ఇపుడిదే అంశంపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాక్సినేషన్ వేస్తున్న కారణంగా ఇప్పటికిప్పుడు పంచాయితి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వం వాదిస్తోంది. ప్రభుత్వ వాదన హైకోర్టు సింగిల్ బెంచ్ సానుకూలమైంది. అయితే డివిజన్ బెంచ్ అంగీకరించలేదు. అయితే ప్రభుత్వ వాదనను డివిజన్ బెంచ్ కొట్టేయలేదు కానీ పంచాయితీ ఎన్నికలు, వ్యాక్సినేషన్ రెండూ ముఖ్యమే అని చెప్పటమే విచిత్రంగా ఉంది. ఇదే సమయంలో పంచాయితి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

దాంతో ప్రభుత్వం సుప్రింకోర్టులో పిటీషన్ వేసింది. ఈ పిటీషన్ సోమవారం విచారణకు రానుంది. హైకోర్టులో వినిపించిన వాదననే సుప్రింకోర్టులో కూడా ప్రభుత్వం వినిపిస్తోంది. అయితే డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పునే ప్రభుత్వం అడ్వాంటేజ్ గా తీసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. డివిజన్ బెంచ్ పంచాయితి ఎన్నికలూ అవసరమే ప్రజలకు వ్యాక్సినేషనూ అవసరమే అని చెప్పటాన్నే ప్రధానంగా హైలైట్ చేస్తోంది.

ఏకకాలంలో రెండు ప్రక్రియలను చేపట్టడం ప్రభుత్వానికి సాధ్యంకాదని ప్రభుత్వం వాదించబోతోంది. ఎన్నికలు నిర్వహించాల్సిందే అని అంటే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపేస్తామని చెప్పాలని డిసైడ్ అయ్యింది. ఇటు ఎన్నికల నిర్వహణ, అటు వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఉద్యోగులు సరిపోరని ప్రభుత్వం వాదించబోతోంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సినేషన్ వేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించటానికి ఇబ్బంది లేదని ప్రభుత్వం, ఉద్యోగుల సంఘాలు తన పిటీషన్లో చెప్పారు.

ప్రభుత్వంతో పాటు ఉద్యోగుల సంఘాలు కూడా ఎన్నికలను వ్యతిరేకిస్తు పిటషన్లు వేసింది. మరి ప్రభుత్వ వాదన లేకపోతే ఉద్యోగుల సంఘాల నేతల వాదనను సుప్రింకోర్టులో చెల్లుబాటవుతుందా ? అన్నదే ఇపుడు సస్పెన్సుగా మారింది. చీఫ్ సెక్రటరీ ఆదిత్య నాద్ దాస్ కూడా వ్యాక్సినేషన్ కారణంగా ఎన్నికల సాధ్యం కాదని తాజాగా నిమ్మగడ్డకు లేఖ రాశారు. చీఫ్ సెక్రటరీ వాదనను నిమ్మగడ్డ ఎలాగూ ఆమోదించరన్న విషయం అందరికీ తెలిసిందే. సుప్రింకోర్టులో వాదనల మీదే పంచాయితి ఎన్నికల భవిష్యత్ ఆధారపడుంది. మరో మూడు రోజులు ఈ సస్పెన్సు కంటిన్యు అవ్వాల్సిందే. చూద్దాం ఏమి జరుగుతుందో.