Begin typing your search above and press return to search.

జగన్‌ ప్రభుత్వం మరోసారి మూడు రాజధానుల బిల్లు తెస్తోందా?

By:  Tupaki Desk   |   1 Dec 2022 4:45 AM GMT
జగన్‌ ప్రభుత్వం మరోసారి మూడు రాజధానుల బిల్లు తెస్తోందా?
X
సుప్రీంకోర్టులో జగన్‌ ప్రభుత్వానికి కాస్త ఊరట లభించడంతో మూడు రాజధానుల ఏర్పాటుపై జగన్‌ ప్రభుత్వం ముందుకు కదులుతోంది. ఆరు నెలల్లో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాలన్న ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు ఇటీవల స్టే విధించిన సంగతి తెలిసిందే. అన్నీ హైకోర్టే చెబితే.. ప్రభుత్వమెందుకని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దీంతో వైఎస్సార్‌సీపీ ఆ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా వర్తింపజేసుకుంటోంది.

జనవరి 31 జరిగే విచారణలో మూడు రాజధానులకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుందని జగన్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మరోమారు మూడు రాజధానుల బిల్లును తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

త్వరలో మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేసి.. మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం తెలపనుందని సమాచారం. ఆ తర్వాత ఈ బిల్లును శాసనసభ, శాసన మండలిలో ప్రవేశపెట్టి రెండు సభల్లో ఆమోదించుకోనుంది. రెండు సభల్లోనూ ప్రస్తుతానికి వైసీపీకి పూర్తి మెజారిటీ ఉంది. దీంతో రెండు సభల్లోనూ మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే. ఆ తర్వాత గవర్నర్‌కు పంపి ఆయన ఆమోదం పొందనుంది. తద్వారా మూడు రాజధానుల బిల్లు చట్ట రూపం దాల్చనుంది.

గతంలో ప్రవేశపెట్టిన రాజధాని వికేంద్రీకరణ బిల్లును, సీఏఆర్డీఏ రద్దు చట్టాలను జగన్‌ ప్రభుత్వం వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. మరింత మెరుగైన బిల్లును తీసుకురావడానికే వీటిని ఉపసంహరించుకున్నామని అప్పట్లో పలువురు మంత్రులు తెలిపారు.

ఇటీవల సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా రాజధాని ఎక్కడ ఉండాలనే విషయాన్ని న్యాయస్థానాలు నిర్దేశించలేవని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఆదేశాలు ఇవ్వడానికి హైకోర్టు ఏమన్నా టౌన్‌ప్లానరా, ఇంజనీరా అని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఈ నేపథ్యంలో మూడు రాజధానులకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుందని వైసీపీ భావిస్తోంది. గతంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌..కూడా పార్లమెంటులో ప్రకటన చేశారు. ఎక్కడి నుంచి పరిపాలన కొనసాగించాలనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమనీ వెల్లడించిన సంగతి తెలిసిందే.

సుప్రీంకోర్టు తాజా తీర్పు, గతంలో కేంద్రం చేసిన ప్రకటనల ఆధారంగా వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు తేవడానికి సిద్ధమవుతోంది. న్యాయపరంగా, సాంకేతికపరంగా ఎలాంటి చిక్కులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటోందని సమాచారం, ఈ నేపథ్యంలో డిసెంబర్‌ రెండో వారంలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి బిల్లును ఆమోదిస్తారని అంటున్నారు.

అలాగే 2023 మార్చి నుంచి విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించడానికి జగన్‌ సిద్ధమవుతున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అటూఇటుగా ఉగాదికి ముందు లేదా ఉగాది తర్వాత విశాఖ నుంచి పాలన ఉంటుందని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.