కేసీఆర్ వల్లే ఈటల బలంగా తయారవుతున్నాడా?

Tue Aug 03 2021 18:00:01 GMT+0530 (IST)

Is the Etela being made stronger by KCR

తెలంగాణ కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయబడ్డ ఈటల రాజేందర్ ను ఆయన మానాన ఆయనను వదిలేస్తే అక్కడికి కథ ముగిసిపోయేది. కానీ అనవసరంగా ఆయనను పైకి లేపి కేసీఆర్ ఇప్పుడు రచ్చకు కారణమయ్యాడన్న చర్చ సాగుతోంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరికీ అదే డౌట్ రాకమానదు.మంత్రివర్గం నుంచి ఈటలను పొమ్మనలేక పొగబెట్టారు. తన అనుకూల చానెల్స్ ద్వారా కేసీఆర్ చేయించిన ప్రచారమే ఈటలపై సానుభూతికి కారణమైందని.. ఆయనను హీరోను చేసిందన్న ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది. అప్పటి నుంచి ప్రతివిషయంలోనూ కేసీఆర్ ‘హుజూరాబాద్ నియోజకవర్గం జపమే చేస్తున్నారని చెప్పొచ్చు.

త్వరలో జరగబోయే హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని కేసీఆర్ చాలా పట్టుదలగా ఉన్నారు. ఇదే సమయంలో తన నియోజకవర్గంలో మళ్లీ తానే గెలవాలని ఇప్పటికే ఈటల రాజేందర్ చేయని ప్రయత్నాలు లేవు.

ఈటలను ఓడించాలని కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలే ఆయనపై సానుభూతికి కారణమై బలోపేతం చేస్తున్నాయని పలువురు విశ్లేషకులు అంటున్నారు. కేసీఆర్ చూపిస్తున్న పట్టుదల చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అవసరానికి మించి నియోజకవర్గంపై కేసీఆర్ చూపిస్తున్న ప్రత్యేక దృష్టి వల్లే ఈటల ఇమేజీ పెరిగిపోతోంది. ఈటల బలమైన నేత కాబట్టే నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా ప్రచారం సాగుతోంది. అందుకే ఇప్పుడు హుజూరాబాద్ లో పెండింగ్ పనులన్నీ పూర్తి అయిపోతున్నాయి.

ఇక దళితబంధు పథకానికి పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ ను ఎంపిక చేయడం.. రెండో విడత గొర్రెల పంపిణీ దళిత కాలనీల్లో వసతులు షాదీ ముబారక్ పేరుతో భవనాల నిర్మాణాలకు నిధుల మంజూరు పెండింగ్ లో ఉన్న కళ్యాణ లక్ష్మీ పథకం అమలు.. రోడ్లు వేయించడం లాంటివన్నీ కూడా హుజూరాబాద్ లో వేగంగా జరిగిపోతున్నాయి. కేవలం ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రూ.2వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు.

ఈటల గెలుస్తాడనే భయంతోనే టీఆర్ఎస్ గెలుపునకు కేసీఆర్ నానా అవస్థలు పడుతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. జరుగుతున్నది చూసిన తర్వాత ఈటలను కేసీఆరే బలోపేతం చేస్తున్నారా? అన్న సందేహాలు కూడా అందరిలో కలుగుతున్నాయి. ఈటల బీసీ నేత కావడంతో కేసీఆర్ దళిత జపం చేస్తున్నారని.. ఆయనను దెబ్బకొట్టేందుకు ఈ ప్లాన్ చేస్తున్నారని నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. చూడాలి మరీ.. కేసీఆర్ పెంచిన ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో గెలుస్తాడో లేదోచూడాలి.