బెంగాలీలకు వెగటు పుట్టించిన మోడీషాల అతి..!

Sun May 02 2021 18:02:18 GMT+0530 (IST)

Is that the only reason for the BJP's miserable defeat?

పొద్దున్నే నిద్ర లేచాక బ్రష్ చేసి టిఫిన్ తో పాటు అయితే రసగుల్లా లేదంటే ఏదో ఒక స్వీట్ నోట్లో వేసుకోనిదే బ్రేక్ ఫాస్ట్ పూర్తి కాదు. దేశంలో ఇలాంటి అలవాటు ఉన్న రాష్ట్రం మరొకటి కనిపించదు.బెంగాలీల తీరు ఎంత విలక్షణంగా ఉంటుందనటానికి ఇదో ఉదాహరణ మాత్రమే. తమను తాము మేధావులుగా ఫీల్ కావటమే కాదు.. విద్యావంతులు.. తెలివిగా ఆలోచించే తీరు తమకే ఉందన్న భావన వారిలో కనిపిస్తుంది. అంతేకాదు.. తమ ప్రాంతాన్ని.. తమ భాషను విపరీతంగా అభిమానిస్తారు.

అంతకు మించి ఆరాధిస్తారు. ఇద్దరు బెంగాలీలు కలిస్తే.. వారి మధ్య బెంగాలీలోనే సంభాషణ సాగుతుందే తప్పించి.. చచ్చినా ఇంగ్లిషులో మాట్లాడరు. ఇక.. హిందీని లైట్ తీసుకుంటారు.

ఇలా చెప్పుకుంటూ విలక్షణత బెంగాల్ ప్రజల సొంతం. వారు అభిమానించటం మొదలు పెడితే.. ఎంతవరకైనా వెళతారు. అంత తేలిగ్గా తమ అభిమానాన్ని వదలుకోరు. అదే సమయంలో.. వారి ప్రేమను పొందటం అంత తేలికైన విషయం కాదు. అందుకు ఎన్నో కఠిన పరీక్షల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. బెంగాలీల సంగతి ఇలా ఉంటే.. తాము టార్గెట్ చేసిన రాష్ట్రం ఏదైనా సరే.. పాగా వేసే వరకు నిద్రపోని తత్త్వం మోడీషాల సొంతం. ఒక రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకోవాలని డిసైడ్ అయ్యాక.. ఎన్ని విధాలుగా కావాలంటే.. అన్ని విధాలుగా ప్రయత్నాలు చేయటం.. తాను చెప్పే వ్యక్తిత్వ వికాస పాఠాలకు భిన్నంగా రాజకీయ ఎత్తులు వేయటం మోడీకి అలవాటు. అవసరానికి తెచ్చుకునే అరువు మాటలు.. అవసరం తీరాక.. తూచ్ అన్నట్లుగా వ్యవహరించే మోడీ తీరుకు.. స్వాభిమానం క్వింటాల్లో ఉండే బెంగాలీలు అంత త్వరగా నమ్ముతారా?

తాజాగా వెలువడిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్ని చూసినప్పుడు యావత్ దేశం ఆశ్చర్యపోయేలా చేసిందని చెప్పాలి. మోడీషాలు ఎన్ని ఎత్తులు వేసినప్పటికి బెంగాలీల ముందు అవేమీ పారలేదు సరికాదా.. ముఖం మీద కొట్టినట్లుగా ఊహించని పరాజయాన్ని వారికి అందించారని చెప్పాలి. అవసరానికి అందిపుచ్చుకునే నినాదాల మత్తులో పడకుండా.. తమను పాలించే అవకాశాన్ని అంత త్వరగా ఇవ్వమన్న సందేశాన్ని తన తీర్పుతో బెంగాలీలు మరోసారి ఫ్రూవ్ చేశారని చెప్పాలి.

దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో ఎనిమిది దశల్లో పోలింగ్ నిర్వహించటం.. సుదీర్ఘకాలం ఎన్నికల ప్రచారానికి కేటాయించేలా చేసినప్పటికి బెంగాలీలు దీదీకే ఓటేశారే తప్పించి మోడీని ఎందుకు నమ్మలేదు? కీలకమైన కరోనా కాలంలో.. అందునా దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న వేళలో.. ఏదో గుర్తుకొచ్చినట్లుగా హటాత్తుగా బంగ్లాదేశ్ టూర్ కు వెళ్లినప్పటికి బెంగాలీల మనసుల్ని మోడీ దోచుకోలేకపోయారెందుకు?

తాజాగా వెలువడుతున్న ఫలితాల్ని చూస్తున్న వారికి బోలెడన్ని సందేహాలు కలుగుతున్నాయి. బెంగాల్ లో బీజేపీ గాలి జోరుగా వీస్తుందని.. ఫలితాల వెల్లడి వేళకు.. దీదీపార్టీ చెల్లాచెదురు అవుతుందన్న కమలనాథుల మాటలు ఇప్పుడు కామెడీగా మారాయి. కేవలం రెండేళ్ల వ్యవధిలో బీజేపీ బలహీనపడిపోతే.. బలం తగ్గిందని భావించిన దీదీ పార్టీ మరింత బలోపేతమైన విషయాన్ని తాజా ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. ఇంతకీ.. ఇంతటి దారుణ పరాజయం బీజేపీకి ఎందుకు సొంతమైంది? అన్నది ప్రశ్నగా మారింది.

సింఫుల్ గా చెప్పాలంటే.. బెంగాలీ ప్రజల్ని.. వారి మనసుల్ని చదవటంలో బీజేపీ విఫలమైంది. వారిని ఓటర్లుగా చూశారే తప్పించి.. వారిని భావోద్వేగంతో కనెక్టు కావటంతో ఫెయిల్ అయ్యారు. అంతేకాదు.. బెంగాల్ కోటపై బీజేపీ జెండా ఎగురవేయాలన్న తపన.. చివరకు అదో ఉన్మాద చర్యగా బెంగాలీలు ఫీలయ్యేలా మోడీషాల తీరు ఉందన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు బెంగాల్ లో అధికారాన్ని సొంతం చేసుకోవటానికి వారు చేపట్టిన చర్యలు బెంగాలీలకు వెగటు పుట్టేలా చేశాయి.

అమితంగా ప్రేమించటానికి.. ఏం చేసైనా సరే తాను కోరుకున్నది సొంతం చేసుకోవాలన్న మైండ్ సెట్ ను ఒక అమ్మాయి చాలా తేలిగ్గా గుర్తిస్తుంది. అదే తీరులో తమ మీద ఉన్న ప్రేమతో పాలించాలని ఫీలయ్యే పార్టీని.. ఏం చేసైనా సరే.. పాలనా పగ్గాలు సొంతం చేసుకోవాలన్న వైనాన్ని బెంగాలీలు గుర్తించకుండా ఉంటారా? .. ప్రేమను ప్రేమగా స్వీకరిస్తారే తప్పించి.. బలంతోనో.. ఒత్తిడితో ఒప్పుకోరు. నిజానికి ఇదే ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన అంశం. అయితే.. అధికారాన్ని సొంతం చేసుకోవాలన్న తపనలో మోడీషాలు ఆ విషయాన్ని మిస్ అయ్యారే. అదే వారికి తీవ్ర నిరాశను మిగిల్చేలా చేసింది.