Begin typing your search above and press return to search.

అమిత్ షా ఫోన్ చేసింది నిజమేనా ?

By:  Tupaki Desk   |   28 Oct 2021 7:40 AM GMT
అమిత్ షా ఫోన్ చేసింది నిజమేనా ?
X
బుధవారం మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుకు షా ఫోన్ చేసి మాట్లాడినట్లు టీడీపీ నుండే అందరికీ సమాచారం వెళ్ళింది. ఢిల్లీ పర్యటన సందర్భంగా తాను ఎందుకని భేటీ కాలేకపోయాననే విషయాన్ని చంద్రబాబుకు హోంశాఖ మంత్రి వివరణ ఇచ్చుకున్నట్లు టీడీపీ మద్దతు మీడియాలో ప్రముఖంగా అచ్చేసుకున్నారు.

మంగళవారం మధ్యహ్నమే కాశ్మీర్ నుండి ఢిల్లీకి తాను వచ్చేసినా వెంటనే కఃన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం ఉండటంతో సమావేశం కాలేకపోయినట్లు చంద్రబాబుకు చెప్పారట. పనిలో పనిగా చంద్రబాబు ఢిల్లీకి ఎందుకు వచ్చారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారట. దాంతో మొత్తం విషయాన్ని చంద్రబాబు పూసగుచ్చినట్లు షాకి వివరించారట. వెంటనే ఏపిలో ఆర్టికల్ 356 విధించేసి రాష్ట్రపతి పాలన విధించాల్సిందే అని చంద్రబాబు గట్టిగా చెప్పారట.

పైన చెప్పిన వర్షన్ మొత్తం టీడీపీ నుండే ప్రచారం జరిగింది. ఇందులో ఎంతవరకు నమ్మచ్చనేది పాఠకులే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే చంద్రబాబును కలవటానికి నరేంద్రమోడి, అమిత్ షా ఏమాత్రం ఇష్టపడటం లేదన్నది వాస్తవం. 2018లో ఎన్డీయేలో నుండి చంద్రబాబు బయటకు వచ్చేసిన తర్వాత నుండి 2019 ఎన్నికల వరకు మోడి, షా ను చంద్రబాబు ఎంతగా అవమానించింది అందరికీ తెలిసిందే. తిరుమల శ్రీవారి దర్శనార్ధం వచ్చిన షా కారుపై రాళ్ళు, చెప్పులు, కర్రలతో టీడీపీ నేతలు దాడి చేశారు.

సో ఇలాంటివన్నీ మరచిపోలేదు కాబట్టే వీళ్ళద్దరు చంద్రబాబును కలవటానికి ఏమాత్రం ఇష్టపడటం లేదని బీజేపీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. ఇక్కడే ఓ అనుమానం పెరిగిపోతోంది. నేరుగా వస్తేనే చంద్రబాబును కలవటానికి ఏమాత్రం ఇష్టపడని షా మరుసటి రోజు ఫోన్ చేసి మాట్లాడుతారా ? ఏమాత్రం నమ్మట్లుగా లేదు. చంద్రబాబుకు అమిత్ ఫోన్ చేసి మాట్లాడినట్లు హోంశాఖ ప్రెస్ రిలీజ్ చేస్తే నమ్మచ్చు. ఎందుకంటే టీడీపీ ఆఫీసులపై దాడి జరిగిన వెంటనే షా కు ఫోన్ చేసి చంద్రబాబు మాట్లాడినట్లు టీడీపీ మద్దతు మీడియాలో ప్రముఖంగా వచ్చింది. అయితే చివరకు చంద్రబాబుకు షా ఫోన్ చేసినట్లు తెలిసిందని కథనాలు ఇవ్వటంతోనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

అయితే అప్పుడు కూడా షా తో చంద్రబాబు మాట్లాడలేదని కేవలం మంత్రి పీఏతో మాత్రమే చంద్రబాబు మాట్లాడినట్లు బీజేపీ నేతలు చెప్పారు. పీఏతో మాట్లాడేసి మంత్రితో మాట్లాడినట్లు చంద్రబాబు కలరింగ్ ఇచ్చుకున్నారన్న కమలనాదుల ఆరోపణలకు తమ్ముళ్ళ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అందుకనే తాజా ప్రచారంపైన కూడా అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. బీజేపీ నేతలు సీన్ లోకి ఎంటరైతే కానీ అసలు విషయం బయటపడదు. చూద్దాం కమలనాదులు ఏమి చెబుతారో ?