బంగారం కొనాల్సిన సమయం వచ్చేసిందా? 10 నెలల కనిష్ఠానికి పడింది

Sun Mar 07 2021 10:35:00 GMT+0530 (IST)

Is it time to buy gold? Fell to a 10-month low

ఆకాశమే హద్దు అన్నట్లుగా సాగిన బంగారం దూకుడుకు ఇటీవల కళ్లాలు పడ్డాయి. కరోనాకు టీకా రావటం.. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు బంగారం ధరకు కళ్లాలు పడేలా చేస్తున్నట్లు చెప్పాలి. గడిచిన కొన్ని నెలలుగా భారీగా ధర పెరిగిన బంగారం.. ఇప్పుడు అందుకు భిన్నంగా పడిపోయింది. తాజాగా తగ్గిన బంగారం ధర పది నెలల కనిష్ఠానికి పడిపోయింది.ఆ మధ్య దగ్గర దగ్గర పదిగ్రాముల బంగారం 60 వేలను టచ్ చేసేస్తుందన్న అంచనాలు వెలువడ్డాయి. అందుకు భిన్నంగా తాజాగా పది గ్రాముల మేలిమి బంగారం రూ.44వేల దిగువకు పడిపోయింది. అదే సమయంలో 22 కేరట్ల బంగారం ధర రూ.4343కు చేరుకుంది. దీంతో పది నెలల తక్కువ ధరకు బంగారం చేరుకున్నట్లైంది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. బంగారం ధరకు తగ్గట్లు వెండి ధర మారుతుంటుంది. బంగారం రేటు తగ్గితే వెండి ధర మరింత తగ్గుతుంది. పెరిగితే.. పెరుగుతుంది. తాజాగా బంగారం ధర తగ్గిన వేళలో.. వెండి ధర మాత్రం పెరగటం ఆసక్తికరంగా మారింది. బంగారం ధర 0.2 శాతం తగ్గితే.. వెండి ధర 0.2 శాతం పెరగటం గమనార్హం. తాజాగా పెరిగిన వెండి ధరతో కేజీ రూ.64805కు చేరుకుంది.

మరి.. ధర తగ్గుతున్న వేళ.. బంగారం కొనుగోలు చేయొచ్చా? అన్నది ప్రశ్న. నిపుణులు చెబుతున్న ప్రకారం.. ఇప్పుడున్న ధర చాలా సబబు అని.. కొనాలనుకున్న వారు వెంటనే కొనేయొచ్చని చెబుతున్నారు. అయితే.. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ధరలో మార్పులు రావొచ్చని.. మరింత తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ‘ప్రస్తుతం ఉన్న ధర చాలా రీజన్ బుల్. కొనాలనుకున్న వారు కొనేయొచ్చు. రానున్న రోజుల్లో మరింత తగ్గొచ్చు. అలా అని డీలా పడాల్సిన అవసరం లేదు. బంగారం కొనుగోలు షార్ట్ టర్మ్ గా కంటే.. లాంగ్ టర్మ్ ఆలోచనలో కొనుగోలు చేస్తేనే ప్రయోజనం ఉంటుంది’ అని చెబుతున్నారు. అదండి సంగతి. మరి.. బంగారం కొనుగోలు మీద మీదైన నిర్ణయం తీసుకోండి.