Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ లో జోడో జోరు నింపినట్టేనా?

By:  Tupaki Desk   |   30 Jan 2023 3:25 PM GMT
కాంగ్రెస్‌ లో జోడో జోరు నింపినట్టేనా?
X
ఒకప్పుడు కేంద్రంతోపాటు వివిధ రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ 2014 నుంచి వరుసగా కేంద్రంతోపాటు వివిధ రాష్ట్రాల్లో అధికారం పోగొట్టుకుంటూ దీన స్థితికి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్‌ గఢ్‌ వంటి రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. గుడ్డిలో మెల్లలా ఇటీవల హిమాచల్‌ ప్రదేశ్‌ లో అధికారం దక్కించుకుంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ కు పునర్వైభవం తేవడం, వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నింటికీ పెద్దన్న పాత్ర పోషించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలుపెట్టిన భారత జోడో యాత్ర వివిధ రాష్ట్రాల మీదుగా జమ్ము కాశ్మీర్ కు చేరుకుంది. జమ్ము కాశ్మీర్ లో రాహుల్‌ గాంధీ భారత జోడో యాత్రను విరమించారు. ఈ కార్యక్రమానికి 21 పార్టీల నేతలను ఆహ్వానించారు.

కాగా భారత జోడో యాత్ర కాంగ్రెస్‌ కు పూర్వ వైభవం తెస్తుందా అంటే ఇప్పటికి ఇప్పుడు కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ యాత్ర ద్వారా రాహుల్‌ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్‌ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలు, వివిధ వర్గాల ప్రజల సాధక బాధకాలు తెలుసుకోవడానికి రాహుల్‌ కు ఒక అవకాశం లభించిందని చెబుతున్నారు. అలాగే రాహుల్‌ గాంధీ నాయకత్వ పటిమపై కాంగ్రెస్‌ పార్టీలో కొంతమందిలో ఉన్న సందేహాలను ఈ యాత్ర ద్వారా రాహుల్‌ తుడిచిపెట్టేశారని అంటున్నారు.

కాగా రాహుల్‌ 2022 సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభించిన 'భారత్‌ జోడో యాత్ర'.. మొత్తం 145 రోజులపాటు సాగింది. 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 75 జిల్లాల్లో మొత్తం 4,080 కిలోమీటర్ల మేర రాహుల్‌ నడిచారు.

కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకూ రాహుల్‌ గాంధీ చేసిన భారత్‌ జోడో యాత్ర దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను ఏకం చేసిన యాత్ర అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జోడో యాత్రలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఎన్నో విపక్ష పార్టీల నేతలు, సీఎంలు, మాజీ సీఎంలు, ఎంపీలు, సామాజిక కార్యకర్తలు ఇలా చాలా మంది మద్దతు తెలపడం విశేషమని చెబుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ కు రాహుల్‌ దిశానిర్దేశం చేయగల సత్తా ఉందా లేదా అనే అభిప్రాయాలు వ్యక్తమైనవారికి ఈ యాత్ర స్పష్టతనిచ్చిందని అంటున్నారు. రాహుల్‌ అంటే ఓ పార్ట్‌ టైమ్‌ పొలిటీషియన్, పప్పు అని విమర్శించిన వారికి ఈ యాత్రతో రాహుల్‌ గాంధీ సమాధానం చెప్పినట్టేనని అంటున్నారు. అంతే కాదు భవిష్యత్తులో దేశ ప్రధాని కావడానికి తనకు అన్ని అర్హతలు ఉన్నాయని రాహుల్‌ నిరూపించుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర కచ్చితంగా కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెంచుతుందని అంతా ఊహించారు. అయితే వారి అంచనాల్ని సైతం తలకిందులు చేస్తూ ప్రస్తుతం ఉన్న 44 సీట్ల నుంచి ఏకంగా 191 సీట్లకు కాంగ్రెస్‌ పార్టీ చేరుకుంటుందని తాజా సర్వేలు వెల్లడించాయి. ఈ మేరకు ఇండియా టుడే– సీ ఓటర్‌ సర్వే తాజాగా తమ సర్వేలో ఇదే విషయాన్ని వెల్లడించాయి. ఈ సర్వేలో పాల్గొన్నవారు సైతం భారత జోడో యాత్రతో రాహుల్‌ గాంధీ తనను తాను నిరూపించుకున్నారని అభిప్రాయపడటం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.