Begin typing your search above and press return to search.

వారితో పెట్టుకుంటే వైసీపీకి డేంజరే... ?

By:  Tupaki Desk   |   29 Nov 2021 11:30 PM GMT
వారితో పెట్టుకుంటే వైసీపీకి డేంజరే... ?
X
వారు రాజకీయాల్లో లేకపోయినా కీలకమైన పాత్ర పోషిస్తారు. సమాజంలో వారు అతి పెద్ద వర్గం. వారు మద్దతు ఇచ్చిన వారే ఎక్కువ సార్లు అధికారంలోకి వచ్చారు. వారే ప్రభుత్వం అనే యంత్రానికి చోదకశక్తి లాంటి ఉద్యోగులు. ఉద్యోగ వర్గం ఇపుడు జగన్ సర్కార్ మీద గుస్సా అవుతోంది. సగం పాలన ముగిసినా పాలకులు తమను కనీసం ఖాతరు చేయడంలేదని, తమకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మండిపోతోంది. ఉద్యోగులకు ఆర్ధికంగా ఇతరత్రా ప్రయోజనం చేకూర్చే హామీలు ఏవీ ఈ రోజు వరకూ ప్రభుత్వం కనీసం పరిశీలన చేయలేదని వారు గుర్రు మీద ఉన్నారు.

దాంతో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం కార్యాచరణను కూడా ప్రకటించారు. డిసెంబర్ 1 నుంచి దశల వారీగా పోరాటానికి రెడీ అయిపోయారు. వారి ఆందోళనలతో ఏపీ సర్కార్ ఉక్కిరి బిక్కిరి కావడం తధ్యమని అంటున్నారు. ఇంతకీ వారు ఎందుకు ప్రభుత్వం మీద మండిపడుతున్నారు అంటే జగన్ పాదయాత్రలో చెప్పిన అనేక హామీలు అలాగే ఉన్నాయి కాబట్టి అంటున్నారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత విధానం అమలు చేస్తామని చెప్పారు. ఇక కొత్త పీయార్సీ కూడా ఇస్తామని చెప్పారు. చంద్రబాబు ఏలుబడి నుంచి పెండింగులో ఉన్న డీఏలను క్లియర్ చేస్తామని అన్నారు. ఇలా చాలా హామీలు ఉన్నాయి.

మరి వాటిని నెరవేర్చకపోగా జీతాలు సైతం ఆలస్యం అవుతున్నాయన్నది వారి ఆవేదన. అంతే కాదు, తమ డిమాండ్లను సీఎం జగన్ అసలు పట్టించుకోవడంలేదని ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు లాంటి వారు ఆరోపిస్తున్నారు. అసలు ఆర్ధిక మంత్రి ఏ రోజు అయినా తమ సమస్యల మీద మాట్లాడారా అన్నది వారి ఆవేదనగా ఉంది. దాంతో ఉద్యమ శంఖారావాన్ని పూరించారు. మరి దీని వల్ల వెంటనే ప్రభుత్వం దిగివస్తుందా అంటే చూడాలి. ఒకవేళ దిగి వచ్చి డిమాండ్లకు ఓకే అన్నా టైమ్ బౌండ్ పెట్టి వాటిని నెరవేర్చకపోతే ఉద్యోగ సంఘాలు అసలు ఊరుకోరు అంటున్నారు.

ఇక ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా పదమూడు లక్షల మంది ఉన్నారు. వారి కుటుంబాలను కూడా లెక్క వేస్తే క కచ్చితంగా అర లక్ష దాకా జనాభా ఉంటారు. ఇంత పెద్ద వర్గం ప్రభుత్వానికి యాంటీ అయితే ఆ ప్రభావం చాలానే ఉంటుంది అంటున్నారు. ఎన్టీయార్ 1983లో సీఎం అయ్యాక ఉద్యోగులతోనే మొదట పెట్టుకున్నారు. దాంతో ఆ ఎడం అలాగే చివరిదాకా సాగింది. 1985లో నాదెండ్ల వెన్నుపోటు ఎపిసోడ్ కారణంగా ఆయన సానుభూతితో గెలిచినా 1989లో ఓడిపోవడానికి ఉద్యోగ వర్గాల ఆక్రోశం కూడా అతి ముఖ్య కారణం అంటారు.

ఇక చంద్రబాబు కూడా చాలా సార్లు ఓటమి చెందడం వెనక ఉద్యోగుల పాత్ర ఉందని విశ్లేషణలు ఉన్నాయి. ఇక 2014 ఎన్నికలలో పాలనా అనుభవం అన్న కారణంతో చంద్రబాబు వైపు తొలిసారి ఉద్యోగులు నిలిచారు, ఆయన గెలిచారు. నిజానికి ఉద్యోగులు ఎపుడూ కాంగ్రెస్ పక్షానే ఉంటారు. ఆ ఒరవడితోనూ, వైఎస్సార్ తనయుడు అన్న ఆలోచనతోనే వైసీపీకి 2019 ఎన్నికలో మద్దతు ఇచ్చారు. అయితే ఇపుడు సీన్ రివర్స్ అవుతోంది. జగన్ తమకు ఏమీ న్యాయం చేయడంలేదని వారు ఆగ్రహిస్తున్నారు. దీన్ని సరైన రీతిన చక్కదిద్దుకుని ఉద్యోగ వర్గంతో మంచి రిలేషన్స్ కొనసాగించకపోతే మాత్రం వైసీపీకి డేంజర్ బెల్స్ మోగడం ఖాయమే అంటున్నారు.