Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆయనేనా?

By:  Tupaki Desk   |   30 July 2021 9:40 AM GMT
హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆయనేనా?
X
హుజూరాబాద్ లో ఇప్పుడు అంత్యంత బలమైన అభ్యర్థిగా బీజేపీ తరుఫున ఈటల రాజేందర్ ఉన్నారు. ఆయనకు పోటీనిచ్చే నాయకుడు ఎవరన్న దానిపై టీఆర్ఎస్ మల్లగుల్లాలు పడుతోంది. కాంగ్రెస్ నుంచి ఇటీవలే టీఆర్ఎస్ లో చేరిన పాడి కౌశిక్ రెడ్డి వైపే మొగ్గుతోంది. అయితే కాంగ్రెస్ కు ఇప్పుడు కౌశిక్ రెడ్డి గుడ్ బై చెప్పడంతో అభ్యర్థి కరువయ్యారు. కౌశిక్ స్థానంలో ఎవరిని నిలబెడుతారన్న ఆసక్తిగా మారింది.

ఇప్పటికే కొత్త పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తెలంగాణలో దూకుడైన రాజకీయం చేస్తున్నాడు. పాత టీడీపీ, కాంగ్రెస్ నేతలను మళ్లీ పార్టీలోకి రప్పిస్తున్నారు. అసంతృప్తిగా ఉన్న వారు అందరినీ కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షిస్తున్నారు. ఇక కాంగ్రెస్ సీనియర్లలోని అసంతృప్తిని చల్లార్చాడు. ఇప్పుడు హుజూరాబాద్ సీటు కొత్త పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారింది. రేవంత్ వచ్చాక హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి కూడా కాసింత బలం పెరిగింది. దీంతో త్రిముఖ పోటీ అనివార్యం అంటున్నారు.

ప్రస్తుతానికి హుజూరాబాద్ నియోకవర్గంలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగానే పోటీ ఉంది. కాంగ్రెస్ ఈ నియోజకవర్గంలో గెలిచి దశాబ్ధాలు గడిచింది. 1978లో దుగ్గిరాల వెంకట్రావ్ కాంగ్రెస్ తరుఫున చివరి సారి గెలిచాడు. మళ్లీ ఇక్కడ గెలవలేకపోయారు. ఆ తర్వాత ఇది టీడీపీకి కంచుకోట అయ్యింది.. పెద్దిరెడ్డి గెలిచి చంద్రబాబు కేబినెట్ లో మంత్రి అయ్యాడు. ఈటల రాజేందర్ రాకతో ఆయనకు ఈ నియోజకవర్గం పెట్టని కోటలా మారింది.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన కౌశిక్ రెడ్డి 62వేలకు పైగా ఓట్లు సాధించారు. ఈటల రాజేందర్ కు గట్టిపోటీనిచ్చి దాదాపు ఓడించినంత పనిచేశాడు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. ఇక ఈటల రాజేందర్ బీజేపీ నుంచి పోటీచేస్తుండడంతో టీఆర్ఎస్ ఓట్లు చీలిపోయాయి. అదేసమయంలో కాంగ్రెస్ పార్టీ తన ఓట్లను తాను సాధించగలిగితే విజయావకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు.

కాంగ్రెస్ ను చివరి నిమిషంలో దెబ్బకొట్టి కౌశిక్ రెడ్డిని చేర్చుకోవాలని టీఆర్ఎస్ అధిష్టానం ప్లాన్ సిద్ధం చేసింది. అంతా అనుకున్నట్లు జరుగుతుందన్న సమయంలో ఆడియో లీక్ కౌశిక్ రెడ్డి కొంపముంచింది. టీఆర్ఎస్ వ్యూహం బెడిసికొట్టినట్టైంది. ఇక టీఆర్ఎస్ సైతం కౌశిక్ రెడ్డికి టికెట్ పై హామీ ఇవ్వలేకపోతోంది. దాంతో కౌశిక్ రెడ్డి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారబోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నిజానికి హుజూరాబాద్ నుంచి కౌశిక్ రెడ్డిని బరిలోకి దింపాలని రేవంత్ రెడ్డి ఎంతో ఆలోచించాడు. యువకుడైన కౌశిక్ పోయిన సారి ఈటలకు గట్టి పోటీనిచ్చి రెండో స్థానంలో నిలిచాడు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ లోకి పోవడంతో రేవంత్ కు తొలి షాక్ తగిలింది.

ఈ క్రమంలోనే కౌశిల్ లాంటి బలమైన అభ్యర్థి పోవడంతో ఇప్పుడు ఆ స్థానంలో రేవంత్ రెడ్డికి ఎవరికి టికెట్ ఇస్తాడన్నది ఆసక్తి నెలకొంది ఇక కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ తో కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అలెర్ట్ అయ్యాడు. టీఆర్ఎస్ తో సన్నిహితంగా ఉండే నేతల పట్ల కాంగ్రెస్ పార్టీ కఠినంగా ఉంటుందనే సంకేతాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ కాంగ్రెస్ ఆ రకమైన సంకేతాలను కాంగ్రెస్ నేతలకు ఇవ్వనుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈటలకు గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి గులాబీ గూటికి చేరిపోయి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. హుజూరాబాద్ లో ఇప్పుడు కాంగ్రెస్ కు క్యాండిడేట్ లేకుండా పోయారు. ఈ క్రమంలోనే పీసీసీ చీఫ్ రేవంత్ ఇక్కడ ‘కేసీఆర్ ఫార్ములా’ను అప్లై చేయాలని భావిస్తున్నాడట..

హుజూరాబాద్ ఎన్నికల ఇన్ చార్జిగా దళిత నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహను నియమించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ రూపకర్త దామోదరనే..ఇప్పుడు కేసీఆర్ ‘దళితబంధు’తో రాగా.. దానికి పోటీగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తో దామోదరకు దళితుల్లో మంచి గుర్తింపు దక్కింది.

హుజూరాబాద్ ఇన్ చార్జిగా ఉన్న దామోదరనే చివరకు అభ్యర్థిగా ఖరారు చేస్తారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దళిత, గిరిజనులను ఆకర్షించడమే ధ్యేయంగా రేవంత్ ఈ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ దళితబంధుతో ఓట్లు టీఆర్ఎస్ కు పోకుండా రేవంత్ ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ గందరగోళ పరిస్థితిలో ఎవరిని రేవంత్ రెడ్డి అభ్యర్థిగా నిలుపుతాడన్నది వేచిచూడాలి.