Begin typing your search above and press return to search.

ఎన్డీఏకు శిరోమణి అకాలీదళ్ షాక్​.. ఇదంతా అమరీందర్​ సింగ్​ స్కెచ్చేనా!

By:  Tupaki Desk   |   27 Sep 2020 6:10 AM GMT
ఎన్డీఏకు శిరోమణి అకాలీదళ్ షాక్​..  ఇదంతా అమరీందర్​ సింగ్​ స్కెచ్చేనా!
X
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బిల్లు దేశవ్యాప్తంగా పలు ప్రకంపనలు సృష్టిస్తున్నది. పంజాబ్​, హర్యానా లాంటి రాష్ట్రాల్లో నిరసనలు మిన్నంటాయి. ఇదిలా ఉంటే రైతు వ్యతిరేక బిల్లును ఎన్డీఏ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్​ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కేంద్రమంత్రి హర్ సిమ్రత్ కౌర్ తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు తాము ఎన్డీఏనుంచి వైదొలుగుతున్నట్టు శిరోమణి అకాలీదల్ శనివారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. కేంద్రం తీసుకొచ్చిన బిల్లు రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నదని అందుకే తాము ఎన్డీఏనుంచి బయటకు వచ్చేశామని ఆ పార్టీ ప్రకటించింది. గత కొంతకాలంగా కేంద్ర బిల్లును వ్యతిరేకిస్తూ పంజాబ్​, హర్యానా రాష్ట్రాల్లో రైతులు రొడ్డెక్కారు. దీంతో ఎన్డీఏలో కొనసాగడంతో శిరోమణి అకాలీదళ్​కు రైతులు, రైతు సంఘాలు దూరమయ్యే పరిస్థితి నెలకొన్నది.

ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాల్లో రైతుల ఓట్లు కీలకంగా ఉన్నాయి. రైతుల్లో వ్యతిరేకత వస్తే పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. దీంతో గత్యంతరం లేని పరిస్థితిల్లో అకాలీదళ్​ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే బీజేపీ-శిరోమణి అకాలీదళ్ పార్టీలు ఎన్నోఏళ్లుగా మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఇప్పటికే ఎన్డీఏ నుంచి శివసేన వైదొలగా.. మరోవైపు శిరోమణి అకాలీదళ్​ కూడా వెళ్లిపోవడం బీజేపీకి మింగుడు పడటం లేదు. ‘రైతు బిల్లులను తాము మొదటి నుంచి వ్యతిరేకించాం. ఈ బిల్లును తీసుకురావొద్దంటూ అనేకసార్లు ఎన్డీఏ కీలకపక్షమైన బీజేపీకి అభ్యర్థించాం. ఈ బిల్లు వచ్చే నష్టాలను ప్రధాని మోదీకి, ప్రభుత్వ పెద్దలకు వివరించే ప్రయత్నం చేశాం. అయినప్పటికీ వారు మొండిగా ముందుకు వెళ్లారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో మేము పార్టీని వీడుతున్నాం’ అంటూ శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ మీడియాకు వివరించారు.

అయితే శిరోమణి అకాలీదళ్​ చీఫ్​.. పంజాబ్​ సీఎం అమరీందర్​ సింగ్​ ట్రాప్​లో పడ్డారని వార్తలు వినిపిస్తున్నాయి. పంజాబ్​లో ఈ బిల్లుకు తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఒకవేళ శిరోమణి అకాలీదల్​ ఈ పరిస్థితుల్లో మౌనంగా ఉన్నా.. రైతులకు సపొర్ట్​ చేయకపోయినా ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉన్నది. మరోవైపు అమరీందర్​ సింగ్​ మాటలు కూడా వారిని మరింత రెచ్చగొట్టాయి. ‘ శిరోమణి అకాలీదళ్​కు రైతుల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఆ పార్టీ ఎన్డీఏనుంచి వైదొలగి ఉద్యమానికి మద్దతు నివ్వాలి. పదవులను అంటిపెట్టుకొని ఉంటే ఆ పార్టీని రైతులు రాళ్లతో కొట్టడం ఖాయం’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో శిరోమణి అకాలీదళ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.