ఛాన్స్ ఉందా : ఉప రాష్ట్రపతిగా మరోసారి వెంకయ్య...?

Wed Jun 29 2022 21:00:01 GMT+0530 (IST)

Is Venkaiah has a chance of Vice President...?

దేశంలో అతి పెద్ద రాజ్యాంగ పదవులు రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి పోస్టులు. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల హడావుడి అలా  ఉండగానే ఉప రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఆగస్ట్ 6న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.  జులై 5 నుంచి  నామినేషన్లను స్వీకరిస్తారు. జులై 19న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ. 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల విత్ డ్రా చేసుకునేందుకు ఈ నెల 22న చివరి తేదీ. పోటీ అనివార్యమైతే ఆగస్టు 6న ఎన్నిక నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ జరుగుతుంది.ఇలా ఉంటే ప్రస్తుత ఉప రాష్ట్రపతి  వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు తో ముగియనుంది. ఆయన 2017 ఆగస్టులో బాధ్యతలు స్వీకరించారు. దాంతో ఆయన ప్లేస్ లో కొత్త వారు వస్తారా లేక వెంకయ్యనాయుడునే కంటిన్యూ చేస్తారా అన్నది అయితే ఇప్పటికి తెలియదు.

ఇక ఉప రాష్ట్రపతిని లోక్ సభ రాజ్యసభలకు చెందిన ఎంపీలు ఎన్నుకుంటారు. మొత్తం ఈ సభ్యుల సంఖ్య  785 గా ఉంది. ఇందులో ఉప రాష్ట్రపతి పదవిని చేపట్టాలీ అంటే కనీసం 393 ఓట్లను సాధించాల్సి ఉంటుంది.

బీజేపీకి లోక్ సభలోనే మిత్రులతో కలిపి 350 దాకా సంఖ్యాబలం ఉంది. ఇక రాజ్యసభలో వందదాకా ఎంపీలు ఆ పార్టీకి ఉన్నారు. మిత్రులు వేరేగా మద్దతు ఇచ్చెనదుకు సిద్ధం. దాంతో సునాయాసంగా ఈ పదవిని బీజేపీ దక్కించుకుంటుంది. మరి ఉప రాష్ట్రపతిగా బీజేపీ మదిలో ఎవరు ఉన్నారు అన్నదే చర్చగా ఉంది.

యూపీకి చెందిన ముస్లిం మైనారిటీ నాయకుడు ముక్తార్ అబ్బాస్ నక్వీకి ఈ కీలకమైన పదవిని కట్టబెడతారు అని అంటున్నారు. మైనారిటీల విషయంలో బీజేపీ తన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు ఈ ప్రయోగం చేస్తుంది అని అంటున్నారు.

అందుకే ఆయనకు రీసెంట్ గా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సీటు ఇవ్వలేదు అని చెబుతున్నారు. ఒక వేళ ఆయన కనుక కాకపోతే ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడునే కంటిన్యూ చేస్తారు అని కూడా అంటున్నారు.