`కమలం`లోనైనా వంగవీటి వికసిస్తారా?

Mon Sep 21 2020 21:30:49 GMT+0530 (IST)

Will the vangaviti bloom in the 'Kamalam'?

రాజకీయాల్లో ఉన్నపుడు పార్టీలు మారడం సహజం. తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న నేతలైతే ఏ పార్టీలోకి వెళ్లినా పెద్దగా సమస్యలేమీ ఉండవు. అయితే కొన్ని సార్లు పరిస్థితులు అనుకూలించక... కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కాకుంటే మాత్రం సొంత ఇమేజ్ ఉన్న నేతలకు సైతం కొన్ని ఇబ్బందులు తప్పవు. ఈ విధంగా నిలకడలేమితో ఏపీలో సొంత ఇమేజ్ ఉండి కూడా ఇబ్బందిపడ్డ నేతల్లో వంగవీటి రాధా ఒకరు. వంగవీటి రంగా తనయుడిగా వంగవీటి రాజకీయ వారసుడిగా బెజవాడలో రాధా చాలాకాలం చక్రం తిప్పారు. కాంగ్రెస్ నేతగా రాజకీయ అరంగేట్రం చేసిన రాధా అనేక పార్టీలు మారి ఇపుడు ఏ పార్టీలో చేరకుండా ఉన్నారు. త్వరలోనే రాధా బీజేపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.కాంగ్రస్ నేతగా ఉన్న రాధా 2009లో ప్రజారాజ్యం తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనం తర్వాత రాధా వైసీపీలో చేరారు. విజయవాడ వైసీపీ అధ్యక్ష పదవి ఇచ్చి వైసిపిలో రాధాకు జగన్ తగిన ప్రాధాన్యత ఇచ్చారు. అయితే 2019 ఎన్నికలకు ముందు విజయవాడ సెంట్రల్ టికెట్ ఇవ్వకపోవడంతోనే రాధా వైసీపీని వీడారన్న ప్రచారం జరిగింది. కాపుల ఓటు బ్యాంక్ బలంగా ఉన్న విజయవాడ ఈస్ట్ నుంచి వంగవీటిని బరిలోకి దింపితే ఫలితం ఉంటుందన్న వైసీపీ అధిష్టానం ఆలోచనకు రాధా ససేమిరా అన్నారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత టీడీపీలో చేరిన రాధా కొన్నాళ్లు పార్టీలో కొనసాగినా...టీడీపీలో ఇమడలేకపోయారు. ఆ తర్వాత జనసేన వైపు చూసిన రాధా....జనసేన నేత నాదెండ్ల మనోహర్ తో జనసేనాని పనవ్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. అయితే జనసేనలో చేరని రాధా...ఆ తర్వాత సుప్త చేతనావస్థలోకి వెళ్లారు.

ఇక తాజాగా ఏపీలో పట్టుపెంచుకోవాలనుకుంటున్న బీజేపీతో రాధా టచ్ లోకి వచ్చారని ప్రచారం జరుగుతోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో రాధా మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇపుడు ఏపీలో బీజేపీకి రాధా వంటి నేతల అవసరం ఉంది. రాధాకు ఇప్పటివరకు చేరని ఓ కొత్త పార్టీ అవసరం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్ విత్ బెనెఫిట్స్ కోటాలో బీజేపీలో రాధా చేరతారా...చేరినా ఎన్నాళ్లు కొనసాగుతారు... `కమలం`లోనైనా వంగవీటి వికసిస్తారా? అన్న విషయం తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.