కేశినేని నాని పోస్టుల వ్యూహం ఇదేనా?

Wed Jun 12 2019 12:30:30 GMT+0530 (IST)

Is This Kesineni Nani Post Strategy

పొమ్మనకుండా పొగబెట్టటం చూశాం. ఇప్పుడు రివర్స్ ఇంజనీరింగ్ తో.. నువ్వు మాకొద్దురా బాబు అనేలా చేయటం కొత్త టెక్నిక్. ఇప్పుడు అదే విధానాన్ని అమలు చేస్తున్నారా టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నది ప్రశ్నగా మారింది. పార్టీ పదవులు ఇవ్వటం కోసం కోట్లాటలు.. అలగటాలు.. అసంతృప్తులు ఇప్పటికెన్నో చూసి ఉంటాం. అందుకు భిన్నంగా పదవి ఇస్తామంటే.. వద్దంటే వద్దని సోషల్ మీడియా వేదికగా చేసుకొని మరీ అధినేతకు సమాచారం ఇవ్వటం దేనికి నిదర్శనం?సరే.. ఒకసారి అంటే ఏదో అలా జరిగిపోయిందని అనుకోవచ్చు. కానీ.. కేశినేని నాని విషయంలో అదే పనిగా సాగుతున్న తీరు చూస్తే.. ఏదో లెక్క తేడా కొట్టటం కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు. ఇప్పటికే రెండు మూడు పోస్టులు పెట్టిన నాని.. తాజాగా పెట్టిన మెసేజ్ లో తానేం చెప్పదలుచుకున్నది చెప్పేశారని చెప్పాలి.

తాను ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేవాడిని కాదని.. అంత పెద్ద మోడీనే ఎదిరించిన వాడినని.. రాష్ట్ర ప్రజలు.. ప్రజా ప్రయోజనాల ముందు తాను ఎవరి ముందు తలవంచనని తనను తానుగొప్పగా చెప్పేసుకోవటం ద్వారా తన ధిక్కార స్వరాన్ని సోషల్ మీడియాలో వినిపించటం దేనికి నిదర్శనం?  భయం తన రక్తంలో లేదని చెప్పేసిన కేశినేని నాని.. మీరేం చేస్తారో చేసుకోండి.. నేను మాత్రం ఇలానే ఉంటానన్న విషయాన్ని చెప్పేశారు. బీజేపీలోకి వెళతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సొంతంగా బయటకు వెళ్లకుండా.. పార్టీతో వేటు వేయించుకొని వెళ్లాలన్నది నాని వ్యూహమని చెబుతున్నారు. తనకు తానుగా పార్టీ వీడితే  తన రాజకీయ స్వార్థంతో నిర్ణయం తీసుకున్నట్లు అవుతుందని.. పార్టీ వేటు వేయటం ద్వారా తాను స్వతంత్రంగా మారి.. తనకు నచ్చిన నిర్ణయాన్ని తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

ఏ తెలుగు తమ్ముడు చేయని రీతిలో తన మనసులోని మాటల్ని వ్యూహాత్మకంగా తెర మీదకు తెస్తున్న నాని.. రానున్న రోజుల్లో తన ధిక్కార స్వరాన్ని అదే పనిగా వినిపించటం ఖాయమంటున్నారు. తాను కోరుకునేది జరిగే వరకూ ఈ పోస్టుల హడావుడి తప్పనట్లే. మరి.. దీనికి బాబు ఎలాంటి పరిష్కారాన్ని వెతుకుతారో చూడాలి.