బీజేపీ. జనసేనల మధ్య పొత్తు ఉన్నట్టా?... లేనట్టా?

Thu Jun 17 2021 22:00:01 GMT+0530 (IST)

Is There An Alliance Between BJP And Janasena

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏపీలో అభిమానుల పరంగా ఓ రేంజిలో భారీ సైన్యం కలిగి ఉన్నామని చెప్పుకునే జనసేన... ఈ రెండు పార్టీల మధ్య చాన్నాళ్ల క్రితమే పొత్తు పొడిచింది. అయితే ఆ పొత్తు ఇప్పుడు కూడా ఇంకా కొనసాగుతున్నట్లా?  లేనట్టా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే... కేంద్రంలో పరిస్థితి ఎలా ఉన్నా ఏపీలో మాత్రం ఏపీలో బీజేపీ జీరోనే. అదే సమయంలో ఓ సైనిక పటాలం ఉందని చెప్పుకుంటున్న జనసేన కూడా ఏపీలో ప్రస్తుతానికి జీరోనే. మరి రెండు పార్టీలూ జీరోలే అయినప్పుడు... కలిసి కలబడినా ఓ మోస్తరు ఫలితం ఉంటుంది కదా. ఆ లెక్కలు వేసుకున్న మీదటే ఈ రెండు పార్టీల మధ్య  పొత్తు పొడిచిందని చెప్పాలి. అయితే ఆ పొత్తును ఇప్పుడు రెండు పార్టీలూ మరిచిపోయాయనే చెప్పక తప్పదు. ఎందుకంటే... ఆ రెండు పార్టీలు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే... ఇదే మాట నిజమని బల్ల గుద్ది మరీ చెప్పక తప్పదు.ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీపై కలిసి పోరాటం చేద్దామంటూ పొత్తు పొడిచిన వేళ అటు బీజేపీతో పాటు ఇటు జనసేనలు సంయుక్తంగా ఘనమైన ప్రకటనలు చేశాయి. తిరుపతి ఉప ఎన్నిక సమయంలో తాము పోటీ చేస్తామంటే... కాదు తామే పోటీ చేస్తామంటూ ఇరు పార్టీలు పట్టుబట్టాయి. అయితే చివరాఖరుకు బీజేపీ అభ్యర్థికే జనసేన మద్దతు పలకక తప్పలేదు. అయితే అభ్యర్థి ప్రకటన దాకా తిరుపతి బరిపై ఇరు పార్టీలు తమదైన శైలి ఉత్సాహం చూపినా.. తీరా అభ్యర్థి ఖరారయ్యాక... ఇరు పార్టీలు చప్పబడిపోయాయి. బీజేపీ తన అభ్యర్థి గెలుపు కోసం ఓ మోస్తరు శ్రమించినా... జనసేన నేతలు గానీ కార్యకర్తలు గానీ పెద్దగా కనిపించలేదు. ఫలితంగా ఆ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిచిన రత్నప్రభ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు.

ఇది పాత కథే అయినా... తాజాగా ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సర్కారు... కొత్తగా చెత్త పన్నును అమల్లోకి తెస్తోందని ఆస్తి పన్నును ఇష్టారాజ్యంగా పెంచేస్తోందని ఆరోపిస్తున్న బీజేపీ... అందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించింది. అనుకున్నట్లుగానే బీజేపీ నిరసనలు చేపట్టింది. అయితే ఈ నిరసనల్లో తమ మిత్రపక్షమైన జనసేన నేతలు మాత్రం కనిపించలేదు. మిత్రపక్షం నేతలుగా బీజేపీ ఆహ్వానించి ఉంటే... జన సేన నేతలు ఈ నిరసనల్లో పాలుపంచుకుని ఉండేవారేనేమో. అయితే బీజేపీ నుంచి ఎలాంటి ఆహ్వానం లేని నేపథ్యంలో ఈ నిరసనల్లో ఒక్కరంటే ఒక్క జన సైనికుడు కూడా కనిపించలేదు. అయినా ఎవరైనా నిరసనలు చేపట్టే సమయంలో మరింత మంది కనిపించేలా ఆ నిరసనలు భారీ ఎత్తున సక్సెస్ అయ్యేలా జనాన్ని పెద్ద ఎత్తున కూడగట్టడం మనం చూస్తున్నదే. అయితే ఎందుకో గానీ.. ఈ కోణంలోనూ బీజేపీ నేతలు ఆలోచించలేదు. తమ మిత్రపక్షం జనసేన అంటూ ఒక పార్టీ ఉందన్న విషయాన్నే మరిచినట్టుగా బీజేపీ నేతలు వ్యవహరించారు.

వెరసి రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన ఈ నిరసనల్లో కమలనాథులు మాత్రమే ప్లకార్లులు పట్టుకుని కనిపించారు. ప్రస్తుతానికి సినిమా షూటింగులు ఇతరత్రా కారణాలతో జనసేనాని పవన్ కల్యాణ్ అసలు బయటకే రావడం లేదు. ఇక పార్టీ తరఫున అప్పుడప్పుడే కనిపిస్తూ ఉన్న పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఈ నిరసనల్లో కనిపించలేదు. పోనీ... ఈ పన్ను పెంపుపై జనసేన సానుకూలంగా కూడా లేదాయే. ఇటీవలే ఈ పన్నుల అంశంపై నిరసన వ్యక్తం చేస్తూ నాదెండ్ల మనోహరే ఓ ప్రకటన చేశారు. మరి ఓ అంశంపై మిత్రపక్షాలుగా ఉన్న రెండు పార్టీలూ ఒకే రకమైన అభిప్రాయాలతో ఉన్నప్పుడు నిరసనలు తెలుపుతున్నప్పుడు కలిసి ఎందుకు ముందుకు సాగడం లేదు?. ఆ పార్టీల మధ్య పొడిచిన పొత్తు చిత్తైపోయిందా?  అన్నదిశగా లెక్కలేనన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా బీజేపీ సింగిల్ గానే ఆందోళనలు చేపట్టి... ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు పెద్ద చర్చకే తెర లేపిందని చెప్పాలి.