Begin typing your search above and press return to search.

చంద్రబాబుకే షాకిస్తున్న సొంత అభ్యర్ధులు

By:  Tupaki Desk   |   1 March 2021 3:42 AM GMT
చంద్రబాబుకే షాకిస్తున్న సొంత అభ్యర్ధులు
X
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ దగ్గరవుతున్న కొద్దీ సొంతపార్టీ అభ్యర్ధులు చంద్రబాబునాయుడుకే షాకులిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ మున్సిపల్ వార్డుల్లో గతంలో టీడీపీ తరపున నామినేషన్లు వేసిన వారిలో కొంతమంది అభ్యర్ధులు తాజాగా వైసీపీలో చేరిపోతున్నారు. ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, చిత్తూరు, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లోని అనేక మున్సిపల్ వార్డులకు గతంలో చాలామంది నామినేషన్లు వేశారు. నామినేషన్లు వేయటంలో కూడా పలువురు ఇతరులతో పోటీలు పడి మరీ బీ ఫారాలు తెచ్చుకున్నారు.

అయితే పోలింగ్ జరగబోతోందనగా హఠత్తుగా అప్పట్లో ఎన్నికలు వాయిదాపడ్డాయి. దాదాపు ఏడాది గ్యాప్ రావటంతో రాజకీయంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగానే మొదటి మార్పేమో టీడీపీ తరపున నామినేషన్లు వేసిన వారిలో కొంతమంది అనారోగ్యం కారణంతో చనిపోయారు. ఇక రెండో రకమైన ఇబ్బందేమో అప్పట్లో నామినేషన్లు వేసిన వారిలో కొందరు వైసీపీ కండువా కప్పేసుకున్నారు. పై రెండు కారణాల వల్ల కొన్ని వార్డులకు టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్ధులే లేకుండాపోయారు.

నామినేషన్లు ముగిసిన కారణంగా సదరు వార్డుల్లో ఇంకెవరితోను నామినేషన్లు వేయించే అవకాశాలు లేవు. దాంతో పోటీనుండి తెలుగుదేశం పార్టీ తప్పుకోవాల్సొస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ పోటీనుండి తప్పుకునే పరిస్దితిలు ఏర్పడటంతో వైసీపీకి పోటీ ఇక నామమాత్రమే అయిపోయింది. ఇదే సమయంలో మరికొన్ని మున్సిపాలిటీల్లో అంతర్గత పోరు బాగా పెరిగిపోతోంది. గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం లాంటి అనేక మున్సిపాలిటీల్లో ఒకరికి మించి నామినేషన్లు వేసేశారు.

అలాంటి మున్సిపాలిటిల్లో నామినేషన్లు వేసిన వాళ్ళు విత్ డ్రా చేసుకోవటానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. దాంతో కొన్ని మున్సిపాలిటిల్లో గందరగోళంగా తయారైంది పరిస్దితి. ఇలాంటివన్నీ ఎన్నికల సమయంలో ప్రతిపార్టీలోను సహజమే అయినా పోటీపడేవాళ్ళని పిలిపించి మాట్లాడే సీనియర్ నేతలే లేకుండా పోయారు.

ఏదో మొక్కుబడిగా పోటీదారులను పిలిపించి సమావేశాలు నిర్వహిస్తున్నా ఏకాభిప్రాయం రాకపోవటంతో వదిలపెట్టేస్తున్నారు. ప్రతి చిన్న విషయాన్ని చంద్రబాబునాయుడే స్వయంగా చూసుకోవాలంటే ఎలా సాధ్యమవుతుందన్న కనీస ఇంగితం కూడా సీనియర్లలో లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.