Begin typing your search above and press return to search.

మమత తో స్వామి కలుస్తున్నారా ?

By:  Tupaki Desk   |   27 Nov 2021 11:30 AM GMT
మమత తో స్వామి కలుస్తున్నారా ?
X
వివాదాస్పద రాజకీయ నేత సుబ్రహ్మణ్య స్వామి పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తో చేతులు కలుపుతారా ? అందరి లోనూ ఇవే అనుమానాలు మొదలయ్యాయి. ఇందుకు రెండు ఘటనలు అవకాశం ఇస్తున్నాయి. మొదటి దేమో నరేంద్ర మోడీ పై స్వామి తాజాగా ట్విట్టర్లో విరుచుకు పడటం. రెండోదేమో కలకత్తా వెళ్ళి మరీ మమత తో స్వామి భేటీ అవ్వడం. నిజానికి స్వామి వల్ల ఇటు బీజేపీ కి అయినా అటు తృణమూల్ కు అయినా పెద్దగా ఒరిగేదేమీ లేదు.

ఎందు కంటే ఆయనేమీ మాస్ లీడర్ కాదు. బాగా చదువుకున్న వ్యక్తి, ప్రొఫెసర్ కావటంతో మేధావుల జాబితా లో ఉంటారు. కాకపోతే ఆయన అదృష్టమే ఏమో ఒకసారి లోక్ సభకు మరోసారి రాజ్యసభకు నామినేట్ అవుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆయన ఏ పార్టీలో ఉన్నా ఎక్కువ కాలం కంటిన్యూ అవలేరు. ఎందుకంటే ఆయన ఎవరి నాయకత్వంలోను ఎక్కువకాలం పనిచేయలేరు. ఎక్కువరోజులు ఆయనకు ఎవరి తోను పడదు.

ప్రస్తుతానికి బీజేపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న స్వామి పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్ తో అయిపోతుంది. మళ్ళీ ఆయనకు రెన్యువల్ దక్కుతుందనే ఆశ కూడా లేదు. ఏ కారణం వల్లనో ఆయన మమత తో భేటీ అవటంతో బీజేపీని వదిలేసి ఫైర్ బ్రాండ్ తో చేతులు కలపబోతున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మోడి ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా అన్నింటా మోడి ప్రభుత్వం ఫెయిలైందంటు విరుచుకుపడ్డారు. మోడీ ప్రభుత్వాన్ని మూర్ఖుల ప్రభుత్వంగా స్వామి అభివర్ణించారు.

ఆర్ధికం, సరిహద్దు భద్రత రంగాల్లో మోడి ప్రభుత్వం ఘోరంగా ఫెయిలైందన్నారు. ఒకటి కాదు రెండు కాదు అన్నీ రంగాల్లోను ప్రభుత్వం ఫెయిల్యూర్ లపై స్వామి గట్టిగానే ట్వీట్లు పెట్టారు. అంటే తనకు రెండోసారి రెన్యువల్ రాదన్న విషయం నిర్ధారణ చేసుకున్నాకే స్వామి కేంద్రంపై విమర్శలకు దిగినట్లు అర్ధమవుతోంది. దీనికితోడు ఈ మధ్యనే బీజేపీ జాతీయ కమిటీ నుంచి కూడా స్వామికి ఉద్వాసన పలికేశారు. మేనకా గాంధీ, వరుణ్ గాంధీలతో పాటు స్వామిని కూడా కమిటి నుండి బయటకు పంపేశారు.

మరి తాజా పరిణామాల ప్రకారం చూస్తే స్వామి తృణమూల్లో కలుస్తారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. కానీ కాస్త అటు ఇటుగా స్వామి-మమతలది ఒకటే మనస్తత్వం. ఎవరితోను ఎక్కువ కాలం సఖ్యతగా ఉండలేరు. బహుశా తృణమూల్ నుండి స్వామికి రాజ్యసభ సభ్యత్వాన్ని మమత హామీ ఇచ్చిందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ తర్వాత ఏమి జరుగుతుందో చూడాల్సిందే. ఏదేమైనా ఇద్దరు కలవటమంటే మామూలు విషయమైతే కాదు. చూద్దాం ఎవరి కలయికలో ఏమవుతుందో ?