షర్మిల స్టేట్మెంట్ ఒక డ్రామానా...?

Tue Sep 27 2022 15:01:50 GMT+0530 (India Standard Time)

Is Sharmila's Statement A Drama...?

వైఎస్ షర్మిల దివంగత సీఎం కి కూతురు ఒక సీఎం కి చెల్లెలు. ఇంటి పేరులో వైఎస్ ఉంది. అది పొలిటికల్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసేదే. అందుకే ఆ పేరుతోనే తెలంగాణాలో రాజకీయ పార్టీ పెట్టారు. గత ఏడాదిన్నర కాలంగా అక్కడ పాదయాత్ర పేరిట ఊరూరా కలియతిరుగుతున్నారు. ఆమె పార్టీ రాజకీయ బలం ఎంతవరకూ పెరిగిందో తెలియదు కానీ అక్కడ రాజకీయ పార్టీలు పెద్దగా పట్టించుకోవడం లేదు అన్న మాట అయితే ఉంది.ఇంకో వైపు చూస్తే 2023లో జరిగే తెలంగాణాలో ఎన్నికల్లో ముక్కోణపు పోటీ సాగుతుంది అన్నది తెలిసిందే. అధికార టీయారెస్ విపక్ష కాంగ్రెస్ బీజేపీ మూడూ ఢీ కొడుతున్నాయి. ఈ మూడు పార్టీలు  తప్ప మరే ఇతర  పార్టీ రేసులో ఉన్నా పెద్దగా ప్రభావం చూపడం కష్టమే అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో షర్మిల ఇంతకాలం అధికార టీయారెస్ మీద విమర్శలు చేస్తూనే గడిపేశారు. కానీ ఇపుడు వ్యూహాలకు కూడా పదును పెడుతున్నారు అని అంటున్నారు.

అందులో భాగనే ఆమె దివంగత నేత మాజీ సీఎం ఎన్టీయార్ మీద అభిమానం చాటుకుంటూ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వడం. ఏపీలో రాజకీయ రచ్చగా ఉన్న హెల్త్ వర్శిటీకి పేరు మార్పు వ్యవహారంలో తెలంగాణా రాజకీయం చూసుకుంటున్న షర్మిలకు ఏమిటి సంబంధం అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ ఆమె కావాలనే కెలికారు అని అంటున్నారు. తన అన్నకు వ్యతిరేకంగా గళం విప్పినా తెలంగాణాలో అది ఎంతో కొంత తనకు లాభం రాజకీయంగా ఉంటుందనే ఆమె అలా చేశారు అని అంటున్నారు.

ఇంతకీ షర్మిల వ్యూహం ఏంటి అంటే తెలంగాణాలో పెద్ద ఎత్తున టీడీపీకి ఓట్లు ఉంటాయి. వాటిని తమవైపునకు తిప్పుకోవడానికి కాంగ్రెస్ టీయారెస్ బీజేపీ ఎవరి మటుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇపుడు షర్మిల కూడా ఆ ఓట్ల కోసమే సీరియస్ గా చూస్తోంది అని అంటున్నారు. తెలంగాణాలో టీడీపీ పోటీ చేయడంలేదు కాబట్టి ఆ పార్టీ ఓట్లు తమ వైపునకు తిప్పుకుంటే ఎంతో కొంత మేలు జరుగుతుందని షర్మిల ఆశిస్తున్నారు అని అంటున్నారు.

అందుకే ఆమె ఈ రకంగా  ఎన్టీయార్ ని పైకి ఒక్కసారిగా ఎత్తేశారు అని అంటున్నారు. నిజానికి ఏపీ రాజకీయాల జోలికి షర్మిల పోవాల్సిన అవసరం లేదు. తెలంగాణాకు చెందిన ఏ రాజకీయ పార్టీ కూడా దీని మీద స్పందించలేదు కూడా. కానీ షర్మిల ఆ విధంగా చేయడం అంటే ఎన్టీయార్ మీద ప్రేమ కాదు అది  ఒక రాజకీయ డ్రామాగానే  జనాలు చూస్తున్నారు అని అంటున్నారు.

నిజానికి షర్మిల పార్టీకి అంత సత్తా ఉంటే వైఎస్సార్ ఓట్లు దండీగా తెలంగాణాలో ఉన్నాయి. వాటిని సాలిడ్ గా కాకపోయినా చాలా మటుకు తన ఖాతాలో వేసుకోవచ్చు. వైఎస్సార్ కి అక్కడ ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. కానీ షర్మిల ఒక సీరియస్ రాజకీయ నాయకురాలిగా అక్కడ ఇంకా జనాల గుర్తింపు పొందలేకపోతున్నారు.

దాంతో ఆమెకు వైఎస్సార్ అభిమానుల ఓట్లు ఎంతవరకూ పడతాయో కూడా తెలియదు. ఇపుడు ఎన్టీయార్ మీద ప్రేమ చాటుకుంటూ ఆమె ఇస్తున్న స్టేట్మెంట్స్ వల్ల ఏమీ ఒరిగేది ఉండదనే అంటున్నారు. తండ్రి అభిమానులనే తన వైపు తిప్పుకోలేకపోతున్న షర్మిల  టీడీపీ వంటి ప్రత్యర్ధి పార్టీ ఓట్లను ఎలా తీసుకోగలదు అన్న చర్చ ఉంది. దీంతో ఇది ఫక్తు రాజకీయ డ్రామాగా కూడా అంతా చూస్తున్నారు. ఎన్టీయార్ గ్రేట్ లీడర్ అని ఒక్కసారి మాట్లాడితే ఆ పార్టీ అభిమానులు కానీ ఆ సామాజికవర్గం కానీ షర్మిల పార్టీ వైపు చూస్తారనుకోవడం రాజకీయ అత్యాశ తప్ప మరేమీ కాదని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.