Begin typing your search above and press return to search.

సీఎం సొంత జిల్లా పర్యటన ... వైసీపీలోకి ఆ టీడీపీ కీలకనేత !

By:  Tupaki Desk   |   6 July 2020 5:30 AM GMT
సీఎం సొంత జిల్లా పర్యటన ... వైసీపీలోకి ఆ టీడీపీ కీలకనేత !
X
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత సొంత జిల్లా అయిన కడప జిల్లా పర్యటనకి వెళ్ళబోతున్నారు. కరోనా మహమ్మారి .. లాక్ డౌన్ విధించడంతో గత కొన్నిరోజులుగా సీఎం జగన్ మోహ‌న్ రెడ్డి త‌ప్ప‌నిస‌రిగా సొంత జిల్లాకు దూరంగా ఉన్నారు. ఈ తరుణం లో తాజాగా జ‌గ‌న్ క‌డ‌ప‌-పులివెందుల ప‌ర్య‌ట‌న‌ఖరారు చేసుకున్నారు. సీఎం జ‌గ‌న్ మోహన్ రెడ్డి తండ్రి, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి జ‌యంతి కార్యక్ర‌మం లో పాల్గొన‌డానికి ఇడుపాల‌ పాయ‌కు సీఎం జగన్ వెళ్లనున్నారు. అలాగే ఈ కార్యక్రమంతో పాటుగా జిల్లాలో ప‌లు అభివృద్ధి కార్యక్ర‌మాలకు సీఎం జ‌గ‌న్ శ్రీకారం చుట్ట‌నున్నారు.

ఈ నెల ఏడు, ఎనిమిదో తేదీల్లో సీఎం జ‌గ‌న్ కడ‌ప జిల్లా ప‌ర్య‌ట‌న ఉండబోతుంది. ఈ సందర్భంగా పార్టీలో ఓ కీలక చేరిక కూడా ఉంటుంద‌ని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్ప‌టికే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన స‌తీష్ రెడ్డి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేర‌నున్న‌ట్టుగా తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా పులివెందులలో వై ఎస్ ఆర్ ఫ్యామిలీకి ఎదురొడ్డి ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. టీడీపీ కి పులివెందుల లో ఆశా కిరణం అని చెప్పవచ్చు. ఒక్కసారి కూడా వై ఎస్ ఆర్ కుటుంబం పై గెలవకపోయినా కూడా సతీష్ రెడ్డి పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారు మోగు తుంటుంది. దానికి కారణం అయన వై ఎస్ ఆర్ కుటుంబం పై పోటీకి సై అంటుండటమే.

అయితే కొన్ని నెల‌ల కింద‌ట స‌తీష్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. తెలుగు దేశం పార్టీ కి పులివెందుల నియోజ‌క వ‌ర్గం లో మొద‌టి నుంచి అండ‌గా ఉంటూ వ‌చ్చిన స‌తీష్ రెడ్డి, చంద్ర‌బాబు తీరుపై విసుగెత్తి రాజీనామా చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. ఆ తరువాత అయన జగన్ సమక్షం లో వైసీపీ లో చేరబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. కరోనా ..లాక్ డౌన్ వంటి పరిణామాలు లేకపోయింటే ఈపాటికే సతీష్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకునేవారు. కరోనా కారణం గా వైసీపీ లో అయన చేరిక లేట‌య్యింద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. ఇప్పుడు ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న నేప‌థ్యం లో, ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే స‌తీష్ రెడ్డి వైసీపీ లోకి చేరబోతున్నట్టుగా తెలుస్తోంది