Begin typing your search above and press return to search.

కొత్త రాజధానిగా రుషికొండ ఖాయమేనా ?

By:  Tupaki Desk   |   1 Dec 2020 5:30 PM GMT
కొత్త రాజధానిగా రుషికొండ ఖాయమేనా ?
X
కొత్త రాజధాని ప్రాంతంగా వైజాగ్ కు సమీపంలోని రుషికొండ ప్రాంతాన్ని ప్రభుత్వం ఎంపిక చేసిందా ? అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. కాలం కలసివస్తే వచ్చే విద్యా సంవత్సరంలోగానే రాజధానిని రుషికొండకు మార్చేందుకు ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. రుషికొండ ప్రాంతమే సీఎం క్యాంపు ఆఫీసుగా ఏర్పాటవుతుందని అంటున్నారు.

సీఎం క్యాంపాఫీసుగా ఏపిఐఐసీ నిర్మించిన మిలీనియం టవర్స్ తో పాటు స్టార్టప్ విలేజిని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో రుషికొండపైనే టూరిజం శాఖ నిర్మించిన హరిత కాటేజీలు కూడా చాలానే ఉన్నాయి. కాటేజీల్లో దిగేవారికి ఎదురుగా సముద్రాన్ని చూడటం మంచి వ్యూ పాయింట్ గా అందరికీ తెలిసిందే. దీన్ని పరిపాలనా పరమైన అవసరాలకు వాడుకోవచ్చని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారట.

ఇదే సమయంలో రుషికొండపైనే ఓ ఐటి కంపెనీ నిర్మించుకున్న భవనం కూడా ఉంది. దీన్ని డీజీపీ సెంట్రల్ ఆఫీసుగా మార్చుకునే విషయం ఆలోచిస్తోందట ప్రభుత్వం. ఈ భవనమే కాకుండా మరికొన్ని భవనాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ ఇతర పరిపాలనా కేంద్రాలుగా మార్చుకునే అవకాశాలను పరిశీలిస్తున్నారు ఉన్నతాధికారులు. మరి కోర్టుల్లో కేసులను వీలైనంత తొందరగా క్లియర్ చేసుకుని రుషికొండకు వెళ్ళిపోవాలన్న ప్రయత్నం ఎప్పుడు నెరవేరుతుందో చూడాల్సిందే.