రేవంత్ కొత్త పార్టీ పెట్టేస్తున్నారా? చక్రం తిప్పేది ఆయనేనా?

Thu Apr 08 2021 11:00:01 GMT+0530 (IST)

Is Revanth putting on a new party?

కొద్ది రోజుల క్రితం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు రావటం తెలిసిందే. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసిన ఆయన.. జాతీయ పార్టీలో చేరనున్నట్లు చెప్పారు. తర్వాత కొత్త పార్టీ రాగాన్ని తీశారు. వాస్తవానికి కాంగ్రెస్ నుంచి బయటపడటానికి ముందే... ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు చెబుతారు. అయితే.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు చెబుతారు. వరుస గెలుపులతో బీజేపీకి వచ్చిన జోష్ మొత్తం ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమితో పోయిందని.. ఆ పార్టీ మీద ఉన్న అంచనాల్లోనూ తేడా వచ్చేస్తున్నాయన్న వాదన మొదలైంది.అదే అంశం కొండాను.. బీజేపీలో చేరకుండా అడ్డుకుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కొండాతో పాటు మరికొందరు కీలక నేతలు కలిసి కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారా? అన్నది చర్చగా మారింది. టీఆర్ఎస్ కు చెందిన కొందరు కీలక నేతలు కూడా ఇందుకు సుముఖంగా ఉన్నారని.. కాకుంటే ఈ అంశం కార్యరూపం దాల్చటానికి కొంత కాలం పడుతుందన్న వాదన వినిపిస్తోంది. ఇలాంటివేళ.. టీ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు వార్తల్లోకి వచ్చారు. ఎన్నికలు ఎక్కడ జరిగినా సంచలనంగా ఉంటూ.. తనదైన రీతిలో ప్రచారాన్ని నిర్వహించే ఆయన.. తాజాగా జరుగుతున్నసాగర్ ఎన్నికల్లో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న వైనం తెలిసిందే.

దీనికి కారణం.. ఆయన కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టే దిశగా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ రథసారధి బాధ్యతల్ని రేవంత్ కు అప్పజెబుతారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే.. జానా లేఖతో ఈ ప్రాసెస్ మధ్యలో ఆగిపోయింది. అయితే.. కాంగ్రెస్ లో తనను ఎదగనీయకుండా పావులు కదుపుతున్న నేతల తీరుతో విసిగిపోయిన రేవంత్.. కొండాతో కలిసి కొత్త పార్టీ పెట్టే అంశంపై సమాలోచనలు జరుపుతున్నట్లు చెబుతున్నారు.

తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ మీద ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని.. కేసీఆర్ సర్కారు మీద వ్యతిరేకత ఉందని బలంగా నమ్ముతున్నవారు.. కొత్త పార్టీని ఏర్పాటుతో ప్రయోజనం ఉంటుందన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. కాంగ్రెస్ పార్టీని రేవంత్ విడిచిపెట్టే ఆలోచనలో ఉన్నారా? అన్న అంశంపై స్పష్టత రావట్లేదు. కానీ.. ఆయన వ్యవహారశైలి మాత్రం అనుమానంగా మారినట్లుగా చెబుతున్నారు. చూస్తుంటే.. కొండాతో కలిసి రేవంత్ అండ్ ఇతరులు కలిసి పార్టీ పెట్టే అవకాశాన్ని కొట్టిపారేయలేమన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో కాలమే డిసైడ్ చేయాలి.