బాబాయ్ అచ్చెన్న కోసం పార్టీ మారే ఆలోచనలో రామ్మోహన్ నాయుడు?

Mon Aug 10 2020 16:40:38 GMT+0530 (IST)

Is Ram Mohan Naidu Joining Bjp?

ఏపీలో ఇప్పుడు సీఎం జగన్ బలంగా ఉన్నాడు. టీడీపీ నేతల్లో ఆయన మొదట టార్గెట్ చేసింది టీడీపీ శాసనసభాపక్ష ఉప నేత అచ్చెన్నాయుడినే.. పక్కా ప్లాన్ ఆధారాలతో ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడును బుక్ చేశారు. దీంతో ఆ కేసు నుంచి అచ్చెన్న బయటపడలేకపోతున్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యి రెండు నెలలు దాటినా కూడా ఏసీబీ కోర్టుతోపాటు హైకోర్టులో కూడా బెయిల్ రావడం లేదు. ఇదే ఇప్పుడు శ్రీకాకుళం ఎంపీ టీడీపీ యువ నేత రామ్మోహన్ నాయుడును కలవరపెడుతోందట..

ఇప్పటికే చంద్రబాబు లోకేష్ సహా ఎంత లాబీయింగ్ చేసినా అచ్చెన్నకు మాత్రం బెయిల్ రావడం లేదన్న ఆందోళన రామ్మోహన్ నాయుడులో ఉందని ప్రచారం జరుగుతోంది. జేసీ ట్రావెల్స్ బస్సుల్లో ఇరుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డికి బెయిల్ వచ్చి అచ్చెన్నకు రాకపోవడంతో ఆయన జీర్ణించుకోవడం లేదట..

ఈ క్రమంలోనే తన బాబాయ్ అచ్చెన్నాయుడును బయటకు తీసుకురావడానికి బీజేపీ పెద్దలను ఆశ్రయించాడనే ప్రచారం సాగుతోంది. ఈ మేరకు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరితో లాబీయింగ్ చేస్తున్నట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అవసరం అయితే తన బాబాయ్ అచ్చెన్నను కాపాడుకోవడానికి బీజేపీలోకి చేరడానికి కూడా సిద్ధం అని రామ్మోహన్ నాయుడు భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.