ప్రాంతీయపార్టీలంటే మోడీకి మంటగా ఉందా ?

Sun Nov 28 2021 20:00:01 GMT+0530 (IST)

Is Modi Anger Over Regional Parties

నరేంద్ర మోడీ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. వారసత్వ రాజకీయాలతోనే ముప్పంటు పెద్ద లెక్షరే ఇచ్చారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా వారసత్వ రాజకీయాలే కనిపిస్తున్నాయంటు మండిపోయారు. కుటుంబ వారసత్వ రాజకీయా వల్లే దేశం సంక్షోభంలో పడిపోయిందనే విచిత్రమైన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. జాతీయ రాజకీయాల్లో గాంధీ-నెహ్రూ కుటుంబంతో పాటు కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా యూపీలో అఖిలేష్ యాదవ్ తమిళనాడులో స్టాలిన్ ఏపీలో జగన్మోహన్ రెడ్డి తెలంగాణాలో కేటీయార్ పేర్లను పరోక్షంగా  ప్రస్తావించారు.రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మోడి ఇంకా చాలానే మాట్లాడారు కానీ వివిధ రాష్ట్రాల్లోని ప్రాతీయపార్టీల వల్ల బీజేపీకి ఎదురవుతున్న సవాళ్ళ కారణంగానే మోడి వారసత్వ రాజకీయాలను ప్రస్తావించినట్లున్నారు. మోడి ప్రస్తావించిన రాష్ట్రాల్లోని పార్టీలు బలంగా ఉన్న కారణంగా బీజేపీకి పుంజుకునే అవకాశం రావటం లేదు. ఒడిస్సా పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయి. దేశంలోని అన్నీ రాష్ట్రాల్లోను బీజేపీ ప్రభుత్వాలే ఉండాలన్న మోడి ఆశలకు ప్రాంతీయ పార్టీలు నీళ్ళు చల్లేస్తున్నాయి.

బీజేపీని ఎదగనీయకుండా చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీలే దెబ్బ కొడుతున్నాయి. ఏపీలో బీజేపీ బలం నామమాత్రం అని కూడా అనుకునేందుకు లేదు. ఏదో పార్టీ ఉందంటే ఉందంతే. తమిళనాడులో కూడా దశాబ్దాలుగా బీజేపీ బలోపేతమవ్వాలని ప్రయత్నిస్తున్నా సాధ్యం కావటంలేదు. కాశ్మీర్లో కూడా అధికారంలోకి రావాలని కమలంపార్టీ ఎంత ప్రయత్నిస్తున్నా సాధ్యం కావటంలేదు. కేరళలో కూడా సేమ్ టు సేమ్ పరిస్దితే. బెంగాల్లో మొన్నటి ఎన్నికల్లో మాత్రమే బీజేపీ కాస్త పుంజుకున్నది.

ఒడిస్సాలో దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నా బీజేపీ పుంజుకోలేకపోతోంది. యూపీలో మాత్రమే అధికారంలోకి వస్తోంది పోతోంది. కర్నాటకలో కాంగ్రెస్ లోని తప్పుల కారణంగా మిత్రపక్షమైన జేడీఎస్ కారణంగానే బీజేపీ ప్రస్తుతం అధికారంలో ఉంది. ఇపుడు అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ సిక్కిం గోవా లాంటి చాలా రాష్ట్రాల్లో అడ్డుగోలు వ్యవహారాలతోనే అధికారంలోకి వచ్చింది తప్ప జనాలు పూర్తి మెజారిటి ఇవ్వబట్టి కాదు. దేశవ్యాప్తంగా మోడి వ్యతిరేకత పెరిగిపోతోందనే ప్రచారం అందరికీ తెలిసిందే.

ఈ వ్యతిరేకత మరింతగా పెరిగిపోతే వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారం కూడా చేజారిపోయే ప్రమాదముంది. అందుకనే ప్రాంతీయపార్టీలపై మోడి కన్నేసినట్లున్నారు. ప్రాంతీయ పార్టీల వల్లే దేశం సంక్షోభంలో పడిపోయిందంటే అర్ధమేంటి ? ప్రాంతీయ పార్టీల విషయంలో మోడి మనసులో ఏముందో అర్ధం కావటంలేదు.

ప్రాంతీయపార్టీల అధినేతలైనా జనాలు మెచ్చి ఓట్లేశారు కాబట్టే అధికారంలోకి రాగలిగారు. అంతేకానీ మధ్యప్రదేశ్ కర్నాటకలో బీజేపీ మాదిరి ప్రభుత్వాలను  కూల్చేసి అధికారంలోకి రాలేదని మోడి మరచిపోయినట్లున్నారు. ఏదేమైనా బీజేపీని అడ్డుకుంటున్న ప్రాంతీయపార్టీలపై మోడి తన మంటను బాగానే బయటపెట్టుకున్నారు.