మమత పోటీ చేసేది అక్కడి నుంచేనా?

Tue May 04 2021 07:00:01 GMT+0530 (IST)

Is Mamata competing from there?

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తన పార్టీని ఒంటిచేత్తో గెలిపించుకున్నారు మమతా బెనర్జీ. కానీ.. తన స్థానాన్ని మాత్రం కోల్పోయారు. నందిగ్రామ్ ఫలితంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఆ సంగతి అటుంచితే.. బెంగాల్ సీఎంగా తానే పగ్గాలు చేపడతానని మమత ప్రకటించారు. రాజ్యాంగం ప్రకారం.. ఎమ్మెల్యేగా గెలవకపోయినా ముఖ్యమంత్రి కావొచ్చు. కానీ.. ఆరు నెలల్లోగా ఏదో ఒక స్థానం నుంచి గెలిచి ఎమ్మెల్యే కావాల్సి ఉంటుంది. దీంతో.. దీదీ ఎంచుకునే స్థానం ఏదనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.తనను ధిక్కించి బీజేపీలో చేరిన సువేందు అధికారిని ఓడించేందుకు.. నందిగ్రామ్ లోనే పోటీచేశారు మమతా బెనర్జీ. చివరి వరకు పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదేవిషయాన్ని చెప్పాయి. చివరకు సందేహించినట్టుగానే మమత ఓడిపోయారు. అయితే.. ఫలితాల్లో మమత గెలిచారని ఓసారి లేదు ఓడిపోయారు అని మరోసారి ప్రకటించినట్టు సమాచారం.

1256 ఓట్ల ఆధిక్యంతో మమత గెలుపొందినట్టు తొలుత ప్రచారం జరగ్గా.. ఆ తర్వాత 1956 ఓట్ల తేడాతో సువేందు విజయం సాధించినట్టు ఈసీ ప్రకటించింది. చివరకు ఓటమిని అంగీకరించిన మమతా బెనర్జీ.. ఎన్నికల కమిషన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల విషయమై తాను సుప్రీం కోర్టుకు సైతం వెళ్తానని మమత చెప్పారు. ఆ విషయంలో ఏం జరుగుతుందన్నది పక్కనపెడితే.. మమత ఇప్పుడు ఎమ్మెల్యే కావడం అత్యవసరం.

ప్రస్తుత పరిస్థితులను చూస్తూ.. బెంగాల్లో మూడు స్థానాలు మమత పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో ఖర్దాహా నియోజకవర్గం ఒకటి జంగీపూర్ రెండోది. శంషేర్ గంజ్ మూడోది. జంగీపూర్ శంషేర్ గంజ్ లో బరిలో నిలిచిన అభ్యర్థులు నామినేషన్లు వేసిన తర్వాత చనిపోయారు. కాబట్టి ఎన్నిక జరగలేదు. ఖర్దాహా నియోజకవర్గంలో మాత్రం పోలింగ్ ముగిసిన తర్వాత టీఎంసీ అభ్యర్థి కాజల్ సిన్హా మరణించారు. అయితే.. ఫలితాల్లో కాజల్ గెలవడం గమనార్హం.

ఈ మూడు స్థానాల్లో మమత ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. ఖర్దాహా నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థి గెలిచారు కాబట్టి.. అక్కడి నుంచే బరిలో నిలుస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.