Begin typing your search above and press return to search.

కర్నూల్ కోట : కోట్ల ఫ్యామిలీని లాగేస్తారా... ?

By:  Tupaki Desk   |   13 Aug 2022 10:59 AM GMT
కర్నూల్ కోట : కోట్ల ఫ్యామిలీని లాగేస్తారా... ?
X
కర్నూల్ జిల్లాలో కోట్ల విజయభాస్కరరెడ్డి ఫ్యామిలీ ఘనమైన చరిత్ర కలిగినది. కోట్ల విజయభాస్కరరెడ్డి తొలి తరం కాంగ్రెస్ నాయకుడు. ఆయన సమితుల నుంచి జెడ్పీ చైర్మన్ నుంచి ఎదిగి ముఖ్యమంత్రుగా రెండు సార్లు అయిన రాజకీయ యోధుడు. ఆయన తరువాత వారసుడిగా వచ్చిన కుమారుడు కోట్ల సూర్యప్రకాశరెడ్డి తండ్రి పలుకుబడితో గెలుస్తున్నారు. మూడు సార్లు ఎంపీగా గెలిచిన ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కానీ కర్నూల్ మొత్తం తన హవా చాటలేకపోతున్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలోనూ మాజీ సీఎం కుమారుడిగా తన సత్తా చాటలేకపోయారు.

ఇపుడు కోట్ల సూర్యప్రకాశరెడ్డి వృద్ధుడు అయ్యారు. ఆయన సతీమణి సుజాతమ్మ కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. వారి రాజకీయ వారసుడిగా కుమారుడు రాఘవేంద్రరెడ్డి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కోట్ల ఫ్యామిలీ నుంచి ఇద్దరు బరిలోకి దిగుతారు అని అంటున్నారు. కోట్ల సుజాతమ్మ రాజకీయంగా రెస్ట్ తీసుకుంటే కుమారుడు రాఘవేంద్రరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అని అంటున్నారు. ఇక సూర్యప్రకాష్ రెడ్డి ఎంపీగా కర్నూల్ నుంచి పోటీ చేస్తారు అని అంటున్నారు.

అయితే టీడీపీలో ఈ ఫ్యామిలీ ఇపుడు బాగానే ఉంది. చంద్రబాబు సైతం కోట్ల ఫ్యామిలీకి మంచి గౌరవం ఇస్తున్నారు. కర్నూల్ జిల్లాలో వారికి రాజకీయ స్వేచ్చ ఉంది. అయితే కోట్ల ఫ్యామిలీని వైసీపీ వైపు లాగేసేందుకు పెద్ద ప్రయత్నమే సాగుతోంది అని అంటున్నారు. ఈ మేరకు ప్రచారం అయితే సాగుతోంది.

నిజానికి కాంగ్రెస్ నుంచి కోట్ల ఫ్యామిలీ ఫస్ట్ వైసీపీలోకే రావాలనుకున్నారు కానీ ఎందుకో టెర్మ్ అండ్ కండిషన్స్ అసలు కుదరలేదు అని చెబుతారు. ఫలితంగా టీడీపీలోనే ఉన్నారు. టీడీపీలోకి వచ్చినా ఈ ఫ్యామిలీకి దక్కేది కూడా ఏమీ లేదనే అంటున్నరు. అయితే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి మాత్రం టీడీపీలోనే ఉండడం ఇష్టమని చెబుతున్నారు. దాంతో మూడవ తరంగా కుమారుడు రాఘవేంద్రరెడ్డిని వైసీపీ వైపు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని చెబుతున్నారు.

మరి అది జరుగుతుందా, కోట్ల ఫ్యామిలీ జగన్ నాయకత్వంలో వైసీపీలో పనిచేస్తుందా అంటే చూడాలి. రాజకీయాల్లో ఎపుడూ ఎవరి అవకాశాలు వారు చూసుకుంటారు కాబట్టి ఏది జరగదు అని చెప్పలేరు.

మొత్తానికి కర్నూల్ లో టీడీపీకి ఇపుడిపుడే గట్టి పట్టు లభిస్తున్న వేళ కోట్ల ఫ్యామిలీ వంటి బిగ్ పొలిటికల్ ఫ్యామిలీ ఏమైనా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే కష్టమే అంటున్నారు. అందుకే ఇక్కడ వైసీపీ పావులు కదుపుతోంది అని కూడా చెబుతున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో. కేవలం ఉత్త ప్రచారంగా మిగిలిపోతుందో.