Begin typing your search above and press return to search.

దుబ్బాకలో చేసిన తప్పే గ్రేటర్ లోనూ కేసీఆర్ చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   26 Nov 2020 6:30 AM GMT
దుబ్బాకలో చేసిన తప్పే గ్రేటర్ లోనూ కేసీఆర్ చేస్తున్నారా?
X
వ్యూహాల్ని నిర్మించటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సాటి వచ్చే వారు ఎవరూ ఉండరన్న మాట తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తరచూ వినిపిస్తూ ఉంటుంది. అయితే.. ఏదీ శాశ్వితం కాదు. ఎత్తులకు పైఎత్తులు వేసే వారు ఎప్పుడో ఒకప్పుడు వస్తారు అలాంటప్పుడు అనవసరమైన ధీమా కంటే ఆచితూచి అడుగులు వేయటం మంచిది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ మిస్ అవుతున్నారా? అన్నది ప్రశ్న.

తాజాగా జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల్ని చూస్తే.. గతంలో ఎప్పుడూ జరగనంత ఇబ్బందికర రీతిలో ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఎప్పుడూ బహిరంగ చర్చకు రాని అంశాలెన్నో ఇప్పుడు వచ్చేస్తున్నాయి. పాతబస్తీ.. కొత్త బస్తీ అన్న విభజన రేఖ స్పష్టంగా రావటంతో పాటు.. మజ్లిస్ తో అధికారపార్టీ అనుబంధాన్ని చూపించి ఓట్లు దండుకోవాలన్న వ్యూహంలో కమలనాథులు ఉంటే.. మజ్లిస్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని.. ఆ మాటకు వస్తే దోస్తానా లాంటిదే లేదన్నట్లుగా టీఆర్ఎస్ చెబుతోంది.

ఎవరెన్ని చెప్పినా.. ప్రజలు వాస్తవాలు తెలీనంత అమాయకులు కాదు కదా? పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న బండి సంజయ్ మాట పెను దుమారంగా మారింది. ఇప్పటివరకు ముక్కలుచెక్కలుగా ఉన్న హిందూ ఓటుబ్యాంకును ఒకచోటకు సమీకరించటమే లక్ష్యంగా బండి సంజయ్ పావులు కదుపుతున్నారు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు కేసీఆర్ అనుసరిస్తున్న వ్యూహం కాస్తంత గందరగోళంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. వాస్తవానికి దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనూ ఇలాంటి కన్ఫ్యూజన్ లోనే చేతిలో ఉన్న అధిక్యతను గులాబీ దళం చేజార్చుకుందన్న మాట వినిపిస్తోంది.

భావోద్వేగ అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చిన బీజేపీ.. దుబ్బాకలో తన అధిక్యతనుప్రదర్శిస్తున్న వేళ.. దాన్ని ధీటుగా ఎదుర్కోవాల్సిన తెలంగాణ అధికారపక్షం.. హైదరాబాద్ లో అల్లర్లు ప్రయత్నం జరుగుతోందని మంత్రి కేటీఆర్ ఆరోపించటం.. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ కు చెందిన వారి నివాసాల్లో లెక్కకు చూపని నగదు ఉందంటూ అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. ఇవన్నీ అధికారపక్షానికి ప్రతికూలంగా మారి.. బీజేపీకి అనుకలమయ్యాయి. దీంతో.. తుది ఫలితంపై ప్రభావం చూపింది.

పాతబస్తీ అంశాన్ని బీజేపీ తలకెత్తుకుంటే.. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ను దెబ్బ తీయాలన్న దుర్మార్గపు ఆలోచనలో బీజేపీ ఉన్నట్లుగా సీఎం కేసీఆర్ సహా మిగిలిన వారు ఆరోపిస్తున్నారు. అయితే.. ఈ వ్యూహం సరికాదంటున్నారు. ఇలాంటి మాటలు బీజేపీపై సానుభూతిని పెంచే ప్రమాదం ఉందన్న మాట వినిపిస్తోంది. దుబ్బాకలో చేసిన తప్పే గ్రేటర్ లోనూ చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.