మరోసారి ప్రధాని మోడీ పర్యటనకు కేసీఆర్ దూరం కాబోతున్నారా?

Tue May 24 2022 11:48:26 GMT+0530 (IST)

Is KCR going to distance itself from PM Modi visit

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి దూరం పాటించబోతున్నారా అంటే అవుననే అంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం బీజేపీపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీపైన కేసీఆర్ నిప్పులు చెరుగుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబించడంతోపాటు మతాల మధ్య చిచ్చు పెడుతోందని ధ్వజమెత్తుతున్నారు. ఇందులో భాగంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని.. తాను దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని కేసీఆర్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు వెళ్లి ఆయా ప్రాంతీయ పార్టీల అధినేతలను ముఖ్యమంత్రులను కలసి కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు.ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం ఢిల్లీ పంజాబ్ ల్లో కేసీఆర్ పర్యటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ లను కలసి కేసీఆర్ చర్చలు జరిపారు. బీజేపీని గద్దె దించాలంటే దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలు కలవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో తాను ముందుంటానని చెబుతున్నారు. మోడీ మరోమారు ప్రధానిగా ఎట్టి పరిస్థితుల్లో రాకూడదని.. అందుకు అన్ని ప్రాంతీయ పార్టీలు కలసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిస్తున్నారు.

ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు కేసీఆర్ దూరంగా ఉండబోతున్నారు. ఇప్పటికే ఒకసారి కేసీఆర్ ఇలాగే చేయడం వివాదాస్పదమైంది. సాధారణంగా ప్రొటోకాల్ ప్రకారం.. ప్రధానమంత్రి ఏదైనా రాష్ట్ర పర్యటనకు వెళ్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలకడం ఆనవాయితీ. దీన్ని కేసీఆర్ బ్రేక్ చేశారు.

 ఇటీవల హైదరాబాద్ లోని ముచ్చింతల్ లో రామానుజాచార్య విగ్రహ ఆవిష్కరణకు ప్రధాని మోడీ వస్తే కేసీఆర్ ఆయనకు స్వాగతం పలకడానికి రాలేదు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కేసీఆర్ ప్రధానిని అవమానించడం ద్వారా 130 కోట్ల మంది భారతీయులను అవమానిస్తున్నారని బీజేపీ నేతలు దుయ్యబట్టారు. నాడు ప్రధాని మోడీ పర్యటనకు ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. మోడీ వచ్చినప్పుడు వెళ్లినప్పుడు ఆయనే విమానాశ్రయానికి వెళ్లారు.

ఈ నేపథ్యంలో మే 26న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటనకు రానున్నారు. దీనికి కూడా దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) పీజీ విద్యార్థుల స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు మోదీ తెలంగాణకు వస్తున్నారు. అయితే 26న ఉదయమే కేసీఆర్ బెంగళూరు వెళ్లనున్నారు.

జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోరుకుంటున్న సీఎం కేసీఆర్ ఈనెల 20 నుంచి దేశవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఏకపక్ష పోకడలతో తీవ్రంగా విభేదిస్తున్న కేసీఆర్.. బీజేపీయేతర పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులను ప్రాంతీయ పార్టీల నాయకులను కలుస్తూ మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్న సంగతి విదితమే. ఇదే క్రమంలో బెంగళూరుకు కూడా వెళ్లనున్నారు.

 అయితే కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న నేపథ్యంలో.. ప్రధానికి ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం పలకడం ఇష్టం లేకనే బెంగళూరులో మాజీ ప్రధాని జనతాదళ్ (సెక్యులర్) నేత దేవెగౌడతో భేటీ కార్యక్రమాన్నికేసీఆర్ విమర్శలు వస్తున్నాయి.

26న ప్రధాని మోదీ పాల్గొనే ఐఎస్‌బీ స్నాతకోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొనడం లేదన్న విషయాన్ని ఐఎస్‌బీ డీన్ మదన్ పిల్లుట్ల పరోక్షంగా ధ్రువీకరించడం గమనార్హం. ఐఎస్బీ స్నాతకోత్సవానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ రాష్ట్ర కేబినెట్‌లోని సీనియర్ మంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ హాజరవుతారని మదన్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంతో విభేదాల నేపథ్యంలోనే.. ఈ ఏడాది ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కూడా సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలతో పాటు సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు ప్రధాని హాజరు కాగా.. విమానాశ్రయంలో స్వాగతం