Begin typing your search above and press return to search.

జూ.ఎన్టీఆర్ తలపడేది లోకేష్ తోనా? బాబుతోనా?

By:  Tupaki Desk   |   18 Nov 2019 4:45 AM GMT
జూ.ఎన్టీఆర్ తలపడేది లోకేష్ తోనా? బాబుతోనా?
X
చంద్రబాబు వయసు అయిపోయింది. యువకుడైన ప్రత్యర్థి జగన్ తో పోటీపడలేడు. ఇక పుత్రరత్నం లోకేష్ బాబు శక్తి సామర్థ్యాల గురించి చెప్పక్కర్లేదు. అందుకే ఇప్పుడు టీడీపీకి జవసత్వాలు నింపేందుకు నందమూరి వారసుడు, హీరో జూనియర్ ఎన్టీఆర్ రావాలని టీడీపీ శ్రేణులు, అసమ్మతి వాదులు ముక్తకంఠంతో వాదిస్తున్నారు.

ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పిన వల్లభనేని వంశీ సైతం లోకేష్ లాంటి అసమర్థుడిని కాపాడడానికి జూ. ఎన్టీఆర్ ను చంద్రబాబు దూరం పెట్టాడని ఘాటు విమర్శలు చేశారు. ఇక కొడాలి నాని సైతం లోకేష్ కోసం ఎన్టీఆర్ ను బలిచేశారని.. లోకేష్ కంటే 100 రెట్లు ఎన్టీఆర్ బెటర్ అంటూ ఆడిపోసుకున్నారు. లోకేష్ నాయకత్వం టీడీపీని పాతిపెడుతుందని ధ్వజమెత్తారు.

ఇలా ఇంటా బయటా లోకేష్ బాబు టీడీపీ భావి వారసుడు కాదని.. జూ. ఎన్టీఆరే రావాలన్న వాదనలు వినిపిస్తున్న వేళ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య దీనిపై హాట్ కామెంట్ చేశారు. ఓ రకంగా టీడీపీ వాదనను వినిపించారు.

వర్ల రామయ్య మాట్లాడుతూ.. 'చంద్రబాబు ఇప్పటికీ బలమైన నేతగా ఉన్నారు. నాయకత్వం వహించే శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి. చంద్రబాబే టీడీపీకి బలం బలగం.. కాబట్టి ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి పాత్ర పోషించాల్సిన అవసరం లేదు' అని క్లారిటీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో వర్ల తెలివిగా లోకేష్ ను జూనియర్ ఎన్టీఆర్ తో పోల్చకుండా చంద్రబాబును ముందుపెట్టి జూనియర్ ను ప్రస్తుతానికైతే పక్కకు తప్పించారు. మరి చంద్రబాబు తరువాత ఏంటన్న ప్రశ్నకు మాత్రం వర్ల సమాధానం ఇవ్వకపోవడం చూస్తే ఆయనకు లోకేష్ పై నమ్మకం లేదా అని టీడీపీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. లోకేష్ ను పోటీకి దింపకుండా చంద్రబాబే నాయకుడు అనడం చూస్తుంటే టీడీపీ లో కూడా లోకేష్ బాబు నాయకత్వంపై నమ్మకం లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

అయినా టీడీపీ నేతలు కోరినా.. చంద్రబాబు, లోకేష్ లు తప్పుకున్నా ఇప్పుడైతే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టే పరిస్థితి లేరు. సినిమా కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఎన్టీఆర్ ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' చేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ. ఇది హిట్ అయితే ఎన్టీఆర్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది. అవన్నీ వదిలి టీడీపీ కోసం ఇప్పటికిప్పుడు ఎన్టీఆర్ వచ్చే పరిస్థితుల్లో అయితే లేరు.. వస్తారనుకుంటే మన భ్రమే మరీ..