జవహరీ బతికేఉన్నాడా ? అమెరికాకు షాక్

Mon Sep 13 2021 11:30:59 GMT+0530 (IST)

Is Jawahar alive? Shock to America

అల్ ఖైదా చీఫ్ ఐమన్ అల్-జవహరీ బతికేఉన్నాడా ? ఈ విషయంపై అమెరికాకు పెద్ద షాక్ తగిలింది. దాదాపు ఏడాది క్రిందటే అనారోగ్యంతో మరణించాడని యావత్ ప్రపంచం అనుకుంటున్న అల్ జవహరి బతికే ఉన్నాడన్న విషయం తాజాగా బయటపడటంతో అమెరికాకు ఏమి మాట్లాడాలో కూడా అర్ధంకావటంలేదు. అమెరికా న్యూయార్క్ లోని జంట టవర్ల కూల్చివేత పరిణామాల తర్వాత అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ మరణించాడు. లాడెన్ చనిపోయిన తర్వాత అల్ ఖైదా చీఫ్ గా జవహరీనే బాధ్యతలు చేపట్టాడు. జవహరీని చంపడానికి అమెరికా చేయని ప్రయత్నం లేదు.అయితే అనారోగ్య కారణాలతో జవహరీ చనిపోయినట్లు ప్రచారం మొదలైంది. ఆ ప్రచారాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ కూడా ధృవీకరించుకున్నది. అయితే ఇంతకాలానికి 60 నిముషాల వీడియో క్లిప్పింగులో జవహరి ప్రసంగాన్ని అమెరికా గమనించి షాక్ తిన్నది. అమెరికా కేంద్రంగా నైట్ ఇంటెలిజెన్స్ గ్రూపు ఒకటి పనిచేస్తోంది. ఈ గ్రూపు పనేమిటంటే జీహాదీ గ్రూపులపై కన్నేసి వాళ్ళ వెబ్ సైట్లను 24 గంటలూ గమనిస్తునే ఉంటుంది.

ఇలా గమనిస్తున్నపుడే ఓ వ్యక్తి మాట్లాడిన 60 నిముషాల వీడియోను నైట్ గ్రూపు గమనించింది. దీనిపై మరింత లోతుగా విశ్లేషించినపుడు షాక్ తినే విషయాలు బయట పడ్డాయట. కారణం ఏమిటంటే ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు అల్ ఖైదా చీఫ్ చనిపోయాడని అనుకుంటున్న జవహరీగా గుర్తించటమే. అంటే అమెరికాతో పాటు యావత్ ప్రపంచం అనుకుంటున్నట్లుగా జవహరి చనిపోలేదని ఆరోగ్యంగానే ఉన్నట్లు తాజాగా బయటపడింది.

తన 60 నిముషాల ప్రసంగంలో జవహరీ ఆల్ ఖైదా తాలిబన్ల గొప్పదనాన్ని ఆఫ్ఘనిస్ధాన్ను తాలిబన్ల ఆక్రమించుకోవటంపై వ్యాఖ్యలు చేశారట. అలాగే జెరూసలేంను ఎప్పటికీ యూదులపరం కానిచ్చేది లేదని కూడా జవహరీ చెప్పాడట. న్యూయార్క్ లోని ట్విన్ టవర్స్ ను కూలగొట్టడం నుండి ఇపుడు ఆఫ్ఘనిస్ధాన్ను ఆక్రమించుకోవటం వరకు ఆల్ ఖైదా తాలిబన్ల విజయాలను ప్రశంసిస్తు జవహరి మాట్లాడిన మాటలను అమెరికా నిఘా విభాగం విశ్లేషిస్తోంది.

జవహరీకి సంబంధించిన తాజా సమాచారంతో అమెరికా నిఘా విభాగానికి పెద్ద షాక్ కొట్టినట్లే అయ్యింది. ఎందుకంటే జవహరి మరణించాడనే వార్తను ఏ ఆధారాలతో అమెరికా నిర్ధారించుకున్నదనే వాదనపై ఇపుడు చర్చ మొదలైంది. మిగిలిన దేశాల సంగతి పక్కనపెట్టేసినా తమ ఇంటెలిజెన్సే ప్రపంచంలో అత్యుత్తమమైనదని అమెరికా చెప్పుకుంటుంది. అలాంటి అమెరికానే బురిడీకొట్టించి ఏడాది పాటు జవహరి మరణించాడని నమ్మించటమంటే మామూలు విషయం కాదు. ఇందుకే అమెరికాకు పెద్ద షాక్ తగిలింది.